చిగురుమామిడి, జూన్ 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి పనులపై అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కరీంనగర్ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. బుధవారం మండలంలోని చిగురుమామిడి, సీతారాంపూర్‌లో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. చిగురుమామిడిలో హరితహారం నర్సరీ, క్రీడాప్రాంగణం, సీతారాంపూర్‌లో నర్సరీ, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న మన ఊరు- మన బడి పనులను పరిశీలించి, వెంటనే పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇక్కడ ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, డీపీవో వీరబుచ్చయ్య, మండల ప్రత్యేకాధికారి నతానియల్, ఎంపీడీవో నర్సయ్య, ఎంపీవో శ్రావణ్‌కుమార్, సర్పంచులు గోలి బాపురెడ్డి, బెజ్జంకి లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శులు అనూష, వెంకటరమణ తదితరులు ఉన్నారు.
కొనసాగుతున్న పనులు
మండలంలో పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. బుధవారం ఆయా గ్రామాల్లో ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గాగిరెడ్డిపల్లిలో సర్పంచ్ సన్నీళ్ల వెంకటేశం అభివృద్ధి పనులను పరిశీలించారు. సుందరగిరి, కొండాపూర్, ముదిమాణిక్యం, బొమ్మనపల్లి గ్రామాల్లో సర్పంచులు శ్రీమూర్తి రమేశ్, పెద్దపల్లి భవాని, జకుల రవి, కానుగంటి భూమిరెడ్డి తదితరులు పారిశుధ్య, అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.
మొక్కలకు ట్రీ గార్డులు
శంకరపట్నం, జూన్ 15: ఐదో విడుత పల్లె ప్రగతి లో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు ట్రీ గార్డులు అమర్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.