జగిత్యాల కలెక్టరేట్, జూన్ 15: వాట్సాప్ ద్వారా మట్కా దందా నడుపుతున్న ముఠా గుట్టు వీడింది. పక్కా సమాచారంతో జగిత్యాల సీసీఎస్ పోలీసులు మట్కా స్థావరంపై దాడి చేయడంతో ఈ అక్రమ వ్యవహారం వెలుగుచూసింది. పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేసి వీరివద్ద నుంచి రూ. లక్ష నగదు, ఏడు మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. పోలీసుల విచారణలో మహారాష్ట్ర కేంద్రంగా మట్కా దందా సాగుతున్నట్లు తేలింది. బుధవారం జగిత్యాల సీసీఎస్ కార్యాలయంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర కేంద్రంగా ఏర్పడ్డ ముఠా జిల్లా కేంద్రంలో గుట్టు చప్పుడు కాకుండా మట్కా నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం మట్కా కేంద్రంపై దాడి చేశారు.
మట్కా ఆడుతున్న మహారాష్ట్రకు చెందిన షేక్ బషీర్, జగిత్యాలకు చెందిన చిలువేరి వెంకటేశ్, నవ్వజ్ సురేశ్, నవ్వజ్ కిశోర్, అమర్రగ్మదా సత్యం, ఆదిమల్ల వీరేశం, ఐలవేని సతీశ్‌ను అరెస్ట్ చేశామని చెప్పారు. వీరి వద్ద నుంచి లక్ష రూపాయలు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మట్కా ఓ విధంగా లాటరీ అని దినసరి కూలీలు, చిరువ్యాపారులే లక్ష్యంగా రూపాయి పెడితే వంద రెట్లు లాభం వస్తుందని నమ్మిస్తూ వాట్సాప్ ద్వారా దందా సాగిస్తున్నారని చెప్పారు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లింపులు చేస్తున్నారని వెల్లడించారు. సాయంత్రం నాలుగు గంటలకు ఓపెన్ చేసి సాయంత్రం ఆరు గంటలకు క్లోజ్ చేసి సాయంత్రం లాటరీ తీసి విజేతలను ప్రకటిస్తారని వెల్లడించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి సంబంధించిన సమాచారాన్ని 9440795588 నంబర్‌కు గాని తెలుపాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ దాడిలో ఆర్ఎస్ఐ కృష్ణగౌడ్, ఎస్ఐ రవీందర్, జగిత్యాల పట్టణ ఎస్ఐ సంజీవ్, కానిస్టేబుళ్లు కిరణ్‌కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.