కలెక్టరేట్, జూన్ 15: సీనియర్ సిటిజన్స్-2007 చట్టాన్ని జిల్లాలో అధికార యంత్రాంగం సక్రమంగా అమలు చేయాలని కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావు కోరారు. వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నగరంలోని కృషి భవన్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీనియర్ సిటిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాధికారులు స్పందించి, వారికి సముచిత ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాలన్నారు.
సీనియర్ సిటిజన్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, పెద్దలను గౌరవించే అంశాలు పిల్లలకు బోధించేందుకు పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. సీనియర్ సిటిజన్ల కార్యాలయానికి ప్రభుత్వం జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించాలని కోరారు. సంస్థ అధ్యక్షుడు సముద్రాల జనార్దన్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డా.ముదుగంటి సుధాకర్‌రెడ్డి, మరిపెల్లి మహేందర్, కఠారి రాజేంద్రప్రసాద్, ముర్తుజా అలీ, చంద్రయ్య, కృష్ణారెడ్డి, మధురబాబు దంపతులతో పాటు పలువురు పాల్గొన్నారు.