మిషన్ కాకతీయ పథకం కింద పునరుద్ధరణకు మున్సిపల్ పరిధిలోని ఇప్పల్నర్సింగాపూర్ గాజోని కుంట ఎంపికైంది. దశాబ్దాలుగా కుంటలో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం రూ.22 లక్షల నిధులు కేటాయించి మరమ్మతులు చేయిస్తుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
-హుజూరాబాద్, జూన్ 15
దశాబ్దాల క్రితం తవ్విన గాజోని నిండా పూడిక పేరుకుపోవడం, పిచ్చి మొక్కలు పెరుగడంతో కుంట రూపు రేఖలు కోల్పోయింది. ఈ క్రమంలో దానిని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కారు మిషన్ కాకతీయ-3లో భాగంగా రూ.22లక్షల నిధుల కేటాయించింది. ఈ నిధులతో కట్టను విస్తరించడంతోపాటు అడుగు మేర ఎత్తును పెంచనున్నారు. అలాగే కాకతీయుల కాలంలో నిర్మించిన మత్తడికి మరమ్మతులు చేయనున్నారు. ముందుగా కుంటలో పెరిగిన పిచ్చి చెట్లు, పేరుకుపోయిన పూడికమట్టిని తొలగింపు పనులు చేపట్టారు. కుంటకు పునర్వైభవం వస్తుండడంతో రైతులు సంంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జోరుగా పనులు.. బహుళ ప్రయోజనాలు
ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఆరు ఎకరాల విస్తీర్ణంలో గల కుంటలో పదిరోజుల నుంచి నిత్యం రెండు ఎక్స్కవేటర్లు, 20 ట్రాక్టర్లతో పూడికతీత, తరలింపు పనులు జరుగుతున్నాయి. కుంట అభివృద్ధితో రైతులతో పాటు గ్రామంలోని మత్స్యకార్మికులకు మేలు జరుగనున్నది. గ్రామంలోని ఈ జలవనరు ఒక్కటే వారికి జీవనాధారమైంది. చేప పిల్లలు పోసినా నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతో వాటి ఎదుగుదల ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. కుంట పునరుద్ధరణతో సమృద్ధిగా నీళ్లు నిలిచే అవకాశం ఉండడంతో మత్స్యసంపద వృద్ధి చెందనున్నది. అంతేకాకుండా చుట్టు పక్కల గల వ్యవసాయ బావుల్లో నీటిమట్టం పెరుగనున్నది. ఇక తాగు, సాగునీటికి ఢోకా ఉండదని గ్రామస్తులు సంంతోషం వ్యక్తం చేస్తున్నారు.