కరీంనగర్ జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ జిల్లాలో మిగిలిన మండలాలతో పోలిస్తే తిమ్మాపూర్ మండలంలో భూ ముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. అందులోనూ అల్గూనూర్ నుంచి మొదలు బెజ్జంకి వర కు రాజీవ్ రహదారిపై వెంట ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకూ ఊహించనతంగా పెరుగుతున్నాయి. ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న ఒక్కో ఎకరం ధర 3కోట్ల నుంచి 4 కోట్ల మధ్య పలుకుతున్నది. కొంత లోపలికి వెళ్తే 2కోట్ల నుంచి 3కోట్ల వరకు ధర ఉన్నది. భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో అక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. కబ్జాలు చేసి తమ ప్లాన్ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ముందు గా ప్రభుత్వ భూముల జాబితా సేకరించడం.. వాటి పక్కనే కొద్ది పాటి పట్టా స్థలాన్ని కొనడం.. ఆ తర్వాత క్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారు. మరికొంత మంది వాటికి ప్రహరీ పెట్టి కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా మోఖా మీద ఉంటూ.. పక్క సర్వేనంబర్ చూపించి.. ప్రభుత్వ భూములను ఒక ప్రణాళిక ప్రకారం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
పక్కా ప్రణాళికతో అడుగులు..
తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ పాఠశాలకు 818 సర్వేనంబర్‌లో 16.32 ఎకరాల ప్రభుత్వ భూ మి ఉన్నట్లుగా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ భూమి చుట్టూ కొంత మంది రియల్టర్లు భూములు కొనుగోలు చేశారు. సదరు రియల్టర్లు ఒక ప్రణాళిక ప్రకారం పాఠశాల స్థలాన్ని కొంత మేర ఆక్రమించుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇక్కడ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గాను రోడ్ల కింద ప్రభు త్వ స్థలాన్ని చూపిస్తూ.. వారు కొనుగోలు చేసిన భూముల క్రయవిక్రయాలు చేస్తున్నట్లు సమాచా రం. అందులో కొంత మంది సిబ్బంది ప్రమే యం కూడా ఉందనే ఆరోపణలున్నాయి. అయి తే ఈ పాఠశాల స్థలానికి సంబంధించి పూర్తి స్థా యి సర్వే చేసి, హద్దులను పక్కాగా నిర్ణయించి, అవసరమైతే ఫెన్సింగ్ వేస్తేనే ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా తిమ్మాపూర్ మండలంలోని 272 సర్వేనంబర్‌లో కొంత భూమిని కొంత మంది ఆక్రమించారని, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ రామకృష్ణ కాలనీ సర్పంచ్ మీసాల అంజయ్య గత నెలలో కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారుల్లో రెండు కళాశాలలకు చెందిన వారితోపాటు ఓ ప్రైవేటు వ్యక్తి ఉన్నారని పే ర్కొంటూ గతంలో సర్వేయర్ ఇచ్చిన రిపోర్టును కూడా ఫిర్యాదుతో జత చేశారు. నిజానికి సర్వేయర్ రిపోర్టు ఇచ్చిన తర్వాత సదరు భూమిని రెవెన్యూ అధికారులు వెంటనే స్వాధీనంలోకి తీసుకోవాలి. కానీ, అలా చేయలేదు. ఈ విషయాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకొని విచారణకు ఆదేశించారు. ఆ మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఆక్రమణకు గురైంది నిజమైనని గుర్తించి, సర్వేలో తేలిన విషయాల అధారంగా హద్దులు నిర్ణయించారు. ఇది ప్రభుత్వ స్థలం అంటూ అక్కడ ఓ బోర్డు పాతి వచ్చారు. పక్షం రోజులు తిరగక ముందే ఆ బోర్డును కొంత మం ది కూల్చి వేశారు. దీంతో రెండు మూడు రోజుల క్రితం మళ్లీ అధికారులు బోర్డు పాతి వెళ్లారు.
ని జానికి అత్యంత విలువైన ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకొని.. అవసరమైతే చుట్టూ కంచె పెట్టాలి. లేదా ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలి. కానీ, హద్దులు పెట్టిన తర్వాత సైతం సదరు కళాశాలల అవసరాలకు వాడుకుంటున్నారంటే అధికారుల సహకారం అంతర్గతంగా ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చన్న విమర్శలు వస్తున్నా యి. అలాగే రెవెన్యూ అధికారులు హద్దులు నిర్ణయించిన ప్రభుత్వ స్థలంలో ఉన్న బావి నుంచి నీటిని కళాశాల వాడుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని తెలిసినా రెవెన్యూ అధికారులు మాత్రం ఏమా త్రం పట్టన్నట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే కొంత మంది మళ్లీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తున్నది. ఇవేకాదు, మరికొన్ని ప్రభుత్వ సర్వేనంబర్లలోనూ ఇదే దందా నడుస్తున్నట్లు తెలుస్తుండగా, కోట్లాది విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి.. అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలాలను కాపాడాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.