కోదండరాముని భారీ విగ్రహ ఏర్పాటుకు బండలింగాపూర్ గండిహనుమాన్ ఆలయ ఆవరణ వేదికగా నిలిచింది. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తన సొంత ఖర్చులతో గండిహనుమాన్ ఆలయ ఆవరణలో శ్రీరాముని భారీ విగ్రహ ఏర్పాటుకు గత సెప్టెంబర్‌లో శ్రీకారం చుట్టారు. తమిళనాడుకు చెందిన కళాకారులతో 56 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని తయారు చేయించారు. భారీ విగ్రహం కిందిభాగంలో ఏర్పాటు చేసిన గుడిలో సీతారాములతో పాటు లక్ష్మణ, హనుమాన్ విగ్రహాలను ఏర్పాటు చేయిస్తున్నారు. కుడి చేతిలో శివధనస్సు, ఎడమ చేతిలో బాణం పట్టుకొని నిల్చున్న రాముని విగ్రహం ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేలా రూపుదిద్దుకున్నది. ఈ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆంజనేయ స్వామికి మన్యుసూక్త పంచామృతాభిషేకం, కుంభస్థాపనం, ప్రతిష్ఠామూర్తుల క్షీరాధివాసం, తీర్థ ప్రసాద వినియోగం, తదితర కార్యక్రమాలు జరిపారు. బండలింగాపూర్‌లో కోదండరాముని ఉత్సవ విగ్రహాల శోభాయాత్రలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొని పూజలు చేశారు. 9న ప్రత్యేక పూజలు చేసి, 10న విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.
భక్తుల కొంగుబంగారం శ్రీ కోదండరాముడి విగ్రహం రెడీ అయింది. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సొంత ఖర్చులతో బండలింగాపూర్ ఆలయ ఆవరణలో 56 అడుగుల ఎత్తుతో అద్భుతంగా రూపుదిద్దుకుంది. కుడి చేతిలో శివధనస్సు, ఎడమ చేతిలో బాణం పట్టుకొని నిల్చున్న ప్రతిమ ప్రజల్లో భక్తి భావాన్ని పెంచుతుండగా, ప్రతిష్ఠాపనోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. 10న విగ్రహావిష్కరణకు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల హాజరుకానుండగా, ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.
– మెట్పల్లి రూరల్, జూన్ 8
ప్రతిష్ఠాపనకు అమాత్యులు
10న జరిగే కోదండరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలకు నలుగురు మంత్రులు హాజరవుతున్నారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగనుండగా, ముఖ్య అతిథులుగా మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ రానున్నారు. విగ్రహ నిర్మాణదాత, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సభాధ్యక్షుడిగా వ్యవహరించనుండగా, విశిష్ఠ అతిథిగా జడ్పీ అధ్యక్షురాలు వసంత హాజరుకానున్నారు.
నా కల ఈ రోజు నెరవేరింది..
నా చిన్నతనంలోనే అమ్మానాన్న పాపారావు-సత్తమ్మ స్వర్గస్థులయ్యారు. వారి జ్ఞాపకార్థం శ్రీరాముడి విగ్రహం ఏర్పాటు చేయించాలని చిన్ననాడే అనుకున్నా. అప్పటి నా కల నా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజు నెరవేరింది. ప్రజల్లో భక్తిభావం పెంపొందించేలా రాముని విగ్రహం కింద ఏర్పాటు చేసిన గుడిలో సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠిస్తాం. త్వరలోనే గండిహనుమాన్ ఆలయం పర్యాటక కేంద్రంగా మారుతుంది. ప్రతిష్ఠాపనోత్సవాలకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీరాముని కృపకు పాత్రులు కావాలి. – విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే