మెట్పల్లి, జూన్ 8: ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న పేదల సొంతింటి కల సాకారం కాబోతున్నది. గృహ ప్రవేశాలకు ముహూర్తం ఖరారు కావడంతో లబ్ధిదారుల్లో రెట్టింపు ఆనందం వెల్లివిరుస్తున్నది. జీవితంలో సొంతిల్లు నిర్మించుకోలేని దయనీయ స్థితిలో ఉండి అద్దె ఇండ్లు, పూరి గుడిసెల్లో నివాసంతో కాలం వెళ్లదీస్తున్న నిరుపేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం ప్రతిష్ఠాకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మెట్పల్లి పట్టణ వ్యాప్తంగా ఇప్పటివరకు డబుల్ బెడ్రూం ఇండ్ల్ల కోసం 2500కు పైగా దరఖాస్తులు రాగా అందులో సొంత ఇల్లు లేని దారిద్య్రరేఖకు దిగువనున్న 1,071 మందిని అర్హులుగా గుర్తించారు.
ఈ పథకం కింద మెట్పల్లి పట్టణానికి మొదటి విడుతలో 110, రెండో విడుతలో 200 చొప్పున డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారు. పట్టణ శివారులోని అర్బన్ హౌసింగ్ కాలనీ సమీపంలో సుమారు రెండెకరాల స్థలంలో మొదటి విడుతలో మంజూరైన 110 డబుల్ బెడ్రూం ఇండ్లను జీ ప్లస్2 పద్ధతిలో ఒక్కో బ్లాకులో 12 ఇండ్లు చొప్పున 9 బ్లాకులతో కూడిన గృహ సముదాయాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లుకు 5.30 లక్షలు, మౌలిక వసతుల కల్పన కోసం ఇంటికి 75 వేలు కేటాయించగా ఆ నిధులతో ఇండ్ల నిర్మాణంతో పాటు అంతర్గత రహదారులు, తాగునీరు. డ్రైనేజీ, విద్యుత్, సెప్టిక్ ట్యాంక్, తదితర మౌలిక వసతులను కల్పించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుని ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటకు వెళ్లే రహదారి పక్కన అర్బన్ హౌసింగ్ కాలనీ సమీపంలో స్థలాన్ని ఎంపిక చేయించి నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించి ఇండ్ల నిర్మాణ పనులు, మౌలిక వసతులకు సంబంధించి పనులను త్వరితగతిన పూర్తి చేయించారు. మరో వైపు 110 డబుల్ బెడ్రూం ఇండ్లకు గాను 103 ఇండ్లకు డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇంటి నంబర్లు సైతం ఇటీవల రెవెన్యూ అధికారులు కేటాయించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ నెల 10న గృహ సముదాయాలను ప్రారంభించి లబ్ధిదారులను గృహ ప్రవేశం చేయించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు.