హుజూరాబాద్‌టౌన్, జూన్8: రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు దళితుల బతుకులు మార్చే గొప్ప పథకమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబం యూనిట్లను ఏర్పాటు చేసుకొని ఆర్థిక సాధికారత, స్వావలంభన సాధించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. బుధవారం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్‌తో కలిసి హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలు, వీణవంక, ఇల్లందకుంట, శంకరపట్నంలో లబ్ధిదారుల యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల కలెక్టర్ మాట్లాడారు.
దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన కోసం పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. పథకం కింద మొదటి విడతలో 5 లక్షల యూనిట్‌ను మంజూరు చేస్తున్నామని, యూనిట్ ప్రారంభించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మంజూరు చేస్తామని చెప్పారు. అనంతరం జమ్మికుంటలో పలు కిరాణా షాపు నిర్వాహకులతో మాట్లాడుతూ షాప్ లైసెన్సు గురించి అడిగి తెలుసుకున్నారు. లైసెన్సు లేకుండా షాపులు నడుపరాదన్నారు. మున్సిపల్ అధికారులు లైసెన్సులపై దుకాణాదారులకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా సక్రమంగా టాక్స్‌ను వసులు చేసి రెవెన్యూను పెంచాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. కాగా, నందం ఆర్టిస్టు స్వయంగా గీసిన అంబేద్కర్ చిత్ర పటాన్ని కలెక్టర్‌కు బహుమతిగా ఇవ్వగా, ఆయనను కలెక్టర్ అభినందించారు. అతిథులను లబ్ధిదారులు శాలువాతో సత్కరించారు. ఇక్కడ జడ్పీ సీఈవో ప్రియాంక, హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక, కమిషనర్ చీమ వెంకన్న, తహసీల్దార్ రాంరెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ ఈడి సురేష్, కౌన్సిలర్లు ఉన్నారు.
ఆర్థికంగా ఎదగాలి
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు చాలా గొప్ప పథకం. దళితుల బతుకులకు కొత్తదారి చూపుతున్నది. నియోజక వర్గంలో స్కీంను దిగ్విజయంగా అమలు చేస్తున్నాం. అర్హులందరికీ యూనిట్లను మంజూరు చేయడమేకాదు ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నాం. లబ్ధిదారులు వ్యాపారంలో రాణించి, ఆర్థికంగా ఎదగాలి. అప్పుడే సర్కారు లక్ష్యం సిద్ధిస్తుంది.
– బండ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
ప్రారంభించిన యూనిట్లివే..
హుజూరాబాద్ పట్టణానికి చెందిన కాతం సదానందం ఇంటర్నెట్ అండ్ ఫొటో ఎడిటింగ్ ఆర్ట్స్, రేడియం అండ్ స్టోన్ ఎన్‌గ్రావింగ్ షాప్, అలాగే తుమ్మల లతకు చెందిన సారీ సెంటర్ ఇల్లందకుంటలో వీణవంక మండలం కొండపాకకు చెందిన సావడమల్ల రమాశ్రీధర్ ఏర్పాటు చేసుకున్న టీమాల్
వీణవంకలో దాసారపు రజిత, శ్యాంకు చెందిన కుట్టు మిషన్ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ శంకరపట్నంలో హుజూరా బాద్‌కు చెందిన సంధ్య ఎంబ్రాయిడింగ్, టైలరింగ్ షాప్‌ను, జమ్మికుంట పట్టణంలో చోటు మోబైల్ షాపు
కేసీఆర్ సారుకు రుణపడి ఉంట..
నేను ఆర్టిస్టుగా పని చేస్తున్న. అరకొర ఉపాధే దొరికేది. సంపాదన అంతంతే ఉండేది. కానీ సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధుతో నా బతుకుకు దారి దొరికింది. పథకం కింద హుజూరాబాద్‌లో ఇంటర్నెట్ అండ్ ఫొటో ఎడిటింగ్ ఆర్ట్స్, రేడియం అండ్ స్టోన్ ఎన్‌గ్రావింగ్ షాప్‌ను చేసుకున్న. ఎంత లేదనుకున్నా రోజుకు రూ.2 లేదా రూ.3వేలు ఎటూ పోవు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంట. – లబ్ధిదారుడు, కాతం సదానందం (హుజూరాబాద్)