కలెక్టరేట్, జూన్ 8: రాజీవ్ స్వగృహ పాత దరఖాస్తుదారులకు రాష్ట్ర సర్కారు ఫ్రీ ఆఫర్ ప్రకటించింది. హెచ్ఎండీఏ అప్రూవల్తో కరీంనగర్ జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్న అంగారిక టౌన్‌షిప్‌లోని ప్లాట్ల వేలంలో ఉచితంగా పాల్గొనే ఛాన్స్ ఇచ్చింది. ఈ మేరకు కలెక్టర్ కర్ణన్ ఉత్తర్వులు విడుదల చేయగా, సంబంధిత అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. గతంలో రాజీవ్ స్వగృహ పేరిట నుస్తులాపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని రామకృష్ణ కాలనీ శివారులో ఏర్పాటు చేసిన అంగారిక టౌన్షిప్లో ప్లాట్ కొనుగోలు చేసేందుకు దరావత్తు చెల్లించి తిరిగి తీసుకోని డిపాజిట్‌దారులు మాత్రమే, ఈ నెల 20 నుంచి మొదలయ్యే వేలంలో ఉచితంగా పాల్గొనేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
స్వగృహ ప్లాటు కోసం గతంలో చెల్లించిన మొత్తానికి సంబంధించి రశీదులను నగరంలోని సుడా కార్యాలయంలో అందజేస్తే, వేలంలో పాల్గొనేందుకు అవసరమైన టోకెన్లు అందజేస్తున్నారు. దరావత్తు డబ్బులు తిరిగి తీసుకున్న దరఖాస్తుదారులు వేలంలో పాల్గొనేందుకు 5వేలు డీడీ తీయాల్సి ఉంటుందని, కొత్తగా పాల్గొనేవారు 10వేల డిమాండ్ డ్రాఫ్ట్ వైస్ చైర్మన్, సుడా పేరిట తీయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ డీడీలను సుడా కార్యాలయంలో అందజేయాలని సూచిస్తున్నారు.
20 నుంచి వేలం..
11 కమర్షియల్, 226 హౌస్ పర్పస్ ప్లాట్లకు ఈ నెల 20 నుంచి 24 వరకు నుస్తులాపూర్ గ్రామంలోని రైతు వేదికలో వేలం జరుగనున్నది. కాగా, డీడీలు కట్టిన వారు రసీదులను ఈ నెల 19వరకు సుడా కార్యాలయంలో అప్పగించాల్సి ఉంటుంది. కాగా, కమర్షియల్ ప్లాట్లకు 16లక్షల నుంచి, ఇంటి స్థలాలకు 12 లక్షల నుంచి వేలం మొదలుకానుంది. వేలంలో ప్లాట్లు దక్కించుకున్నవారు నెల రోజుల్లోపు పాడిన మొత్తం ఒకేసారి చెల్లిస్తే, 2శాతం రిబేటు కూడా ఇవ్వనున్నారు. లేదంటే మూడు వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వారంలోగా 33శాతం, 45రోజుల్లోగా 33శాతం, 90రోజుల్లోగా తుది విడత చెల్లించాల్సి ఉంటుంది. వేలంపాటలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్న జిల్లావాసులు, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిత్యం కలెక్టరేట్‌కు పదుల సంఖ్యలో వస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, వచ్చిన వారిలో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తున్నారు.