ఇవాళ ఒక నాయకుడి పుట్టిన రోజు మాత్రమే కాదు.. ఉద్యమం పుట్టిన రోజు కూడా.. స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ, ఆత్మగౌరవంతో ఈ జాతి బతుకుతున్నదంటే దానికి ఒకే ఒక కారకుడు కేసీఆర్. ధర్మం దారి తప్పినప్పుడు, అధర్మం రాజ్యమేలినప్పుడు దేవుడే దారి చూపిస్తడని భగవద్గీతలో ఉన్నది. సరిగ్గా అలానే కేసీఆర్ బయల్దేరిండ్రు.
-హరీశ్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): చావునోట్లో తలపెట్టి ప్రాణాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడి రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు, కారణజన్ముడు కేసీఆర్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కొనియాడారు. కేసీఆర్ జన్మదినం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పర్వదినమని చెప్పారు. ‘చరిత్రలో చాలా మంది ఉంటారు కానీ, చరిత్ర పుట్లలో శాశ్వతంగా నిలిచే నాయకుడు కేసీఆర్ మాత్రమే’ అని స్పష్టంచేశారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ సాధించారని, ఇందుకోసం ఆయన చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావని గుర్తుచేశారు.
హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో మంగళవారం నిర్వహించిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో హరీశ్‌రావు మాట్లాడారు. ‘ఇవాళ ఒక నాయకుడి పుట్టిన రోజు మాత్రమే కాదు, ఉద్యమం పుట్టిన రోజు కూడా.. స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ, ఆత్మగౌరవంతో ఈ జాతి బతుకుతున్నదంటే దానికి ఒకే ఒక కారకుడు కేసీఆర్’ అని తేల్చిచెప్పారు. ‘ధర్మం దారి తప్పినప్పుడు, అధర్మం రాజ్యమేలినప్పుడు దేవుడు దారి చూపిస్తాడని భగవద్గీతలో ఉన్నది. అదే సమయంలో కేసీఆర్ బయల్దేరారు’ అని గుర్తుచేశారు.
శాసనసభలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారని, జాతి ఆత్మగౌరవాన్ని రూపుమాపే కుట్రలు జరిగాయని విమర్శించారు. నాడు తెలంగాణ మాది అని చెప్పుకోలేని దుస్థితికి నెట్టివేయబడ్డామని, తెలంగాణ అన్యాయం గురించి శాసనసభలో మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఆరు సూత్రాలు, పెద్ద మనుషుల ఒప్పం దం అన్నీ తుంగలో తొకి తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ యాస, భాష, జాతి గౌరవం దెబ్బతిన్నప్పుడు తానున్నానంటూ బయల్దేరిన నేత కేసీఆర్ అని గుర్తుచేశారు. ఆయనే లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేదా? అని ప్రశ్నించారు. ఎందరో ఉద్యమం చేసినా గమ్యాన్ని చేరుకోలేకపోయారని, కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో.. అని ఎత్తిన జెండా దించకుండా నినదించి పోరాడిన నేత కేసీఆర్ అని కొనియాడారు.
కేసీఆర్ గడ్డిపోచల్లా పదవులను వదిలేసిండ్రు
ఒక కౌన్సిలర్ పదవి కోసం కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధాలు, పొత్తులు చూస్తున్నామని, పదవి కోసం సిద్ధాంతాలు పకన పెట్టి ఎలా కలిశాయో గమనిస్తున్నామని, కానీ కేసీఆర్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి పదవులను గడ్డి పోచల్లా వదిలేసి రాష్ర్టాన్ని సాధించారని హరీశ్ స్పష్టంచేశారు. ఆ త్యాగం, ఆ ధైర్యం లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని తేల్చిచెప్పారు. కేసీఆర్ తిన్నన్ని తిట్లు, పడినన్ని పాట్లు, ఆయనపై జరిగిన కుట్రలు చరిత్రలో ఏ నాయకుడి మీదా జరిగి ఉండకపోవచ్చని చెప్పారు. మొండి ధైర్యంతో ముందుకు సాగారు కాబట్టే తెలంగాణ సాధ్యమైందని తెలిపారు. ఏ ప్రలోభాలకూ తలొగ్గకుండా, ప్రాణాన్ని సైతం వదిలేందుకు సిద్ధపడ్డారని గుర్తుచేశారు.
‘నిమ్స్‌లో నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్‌ను చూసిన డాక్టర్లు.. ఆయన చివరిదశలో ఉన్నడు.. ఆయనను ఒప్పించి దీక్ష మాన్పించండి అని చెప్తే మా కండ్లల్లో నీళ్లు తిరిగినయి. కేసీఆర్ మాత్రం అదే మొండి ధైర్యం చూపిండ్రు. దీక్ష విరమించాలని చెప్పడానికి నా వద్దకు రావొద్దని చెప్పిండ్రు. ‘అయితే తెలంగాణ జైత్రయాత్ర, లేదంటే నా శవయాత్ర అని బయల్దేరిన.. దానికే కట్టుబడి ఉన్నా’ అని చెప్పిండ్రు. అదే పట్టుదలతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిండ్రు. కేసీఆర్ ఒక నాయకుడు, ఉద్యమకారుడే కాదు. తెలంగాణవాళ్లకు పాలన రాదు అని అనే స్థాయి నుంచి తెలంగాణ ఆచరిస్తది, దేశం అనుసరిస్తది అనే స్థాయికి చేర్చారు. కేసీఆర్ ఉద్యమకారుడు, కేసీఆర్ చరిత్రకారుడు, పాలనాదక్షుడు అని చరిత్ర పుటల్లో నిలిచింది’ అని పేర్కొన్నారు.
కేసీఆర్ పథకాలు దేశానికి దిక్సూచి
రాష్ట్రంలో కేసీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి ఎన్నో కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా మారాయని హరీశ్ గుర్తుచేశారు. ‘అవ్వాతాతలకు ఆసరా పింఛన్లు ఇచ్చిన పెద్ద కొడుకు కేసీఆర్. ఆడపిల్లల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మీ ఇచ్చిన తోబుట్టువు కేసీఆర్. పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు ఇచ్చిన మేనమామ. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి, కరెంట్ ఇచ్చి రైతన్నలకు తోడుగా నిలిచిండు కేసీఆర్. ఎవరు ఔనన్నా కాదన్నా ఇదంతా ఒక చరిత్ర. అలాంటి కేసీఆర్ గురించి ఎంత చెప్పుకొన్నా చరిత్రే. నిజంగా నాలాంటి వారికి 25 ఏండ్లు ఉద్యమంలో, ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో వారి అడుగుజాడల్లో నడిచే అవకాశం కల్పించారు. కార్యకర్తలుగా, నాయకులుగా, చట్టసభల్లో సభ్యులుగా తీర్చిదిద్దారు. అలాంటి కేసీఆర్‌కు అందరి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు. అందరి ప్రార్థనలు, దేవుడి ఆశీస్సులతో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు’ అని హరీశ్ చెప్పా.