విద్యానగర్, జూన్ 8 : చిరు వ్యాపారులకు విరివిగా రుణాలు అందించి ప్రోత్సహించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బ్యాంకర్లకు సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా బుధవారం రెవెన్యూ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రజాచేరువ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకింగ్ అవుట్ రీచ్ కార్యక్రమంలో వివిధ బ్యాంకులు పాల్గొని సహాయక బృందాలకు పెద్ద ఎత్తున రుణాలను అందించడం అభినందనీయమన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకం అమలు చేస్తున్నదని, లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ. 10 లక్షలు జమ చేసిందని గుర్తు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 17,774 మంది లబ్ధిదారుల ఖాతాల్లో దాదాపు రూ.2వేల కోట్లు జమ చేయడంలో బ్యాంకర్లు అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకర్లు వినియోగదారులకు సేవలందించడంలో ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ కేడీసీసీబీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి మొత్తం 1,017 స్వయం సహాయక గ్రూపులకు 114.24 కోట్ల రూపాయల రుణాలను కలెక్టర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, మెప్మా పీడీ రవీందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు, ఎస్బీఐ ఏజీఎం రవి శేఖర్, ఎం శ్రీనివాస్, యూబీఐ ఏజీఎం నరసింగరావు, కేడీసీసీబీ సీఈవో ఎం సత్యనారాయణరావు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం రామ్మోహన్రావు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సరిల్ హెడ్ పీ రాజీవ్, ఐసీఐసీఐ బ్రాంచ్ మేనేజర్ శ్రీధర్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సురేశ్ బాబు ఇతర బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.