రాంనగర్, జూన్ 8: తమకున్న పరిచయాలు, బంధుత్వాన్ని అడ్డుపెట్టుకొని మహిళలను వేధించిన ఇద్దరిని బుధవారం పోలీసులు కటాకటాల వెనకి నెట్టారు. పోలీసుల వివరాల ప్రకారం .. మానకొండూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి అయిన భాషబోయిన అరుణ్ అదే మండలానికి చెందిన ఓ మహిళ భర్తతో పరిచయం పెంచుకొని, తరచూ వాళ్లింటికి వెళ్తుండేవాడు. ఆమెకు మాయమాటలు చెప్పి, చంపుతానని బెదిరించి ఆమెను శారీరకంగా వేధింపులకు గురి చేసేవాడు. అతని బాధలు భరించలేక ఆమె షీటీమ్స్‌ను సంప్రదించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు షీటీమ్స్, టాస్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా, సాక్ష్యాధారాలతో సహా నిందితుడు అరుణ్‌ను అరెస్టు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా వేధించానని ఒప్పుకోవడంతో అరుణ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. కాగా నిందితుడు 15 రోజుల క్రితం తన వాహనానికి పోలీస్ సైరన్ బిగించుకొని విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరించిన ఘటనలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని బైండోవర్ చేసి వదిలేశారు. తాజా ఘటనతో మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరో ఘటనలో..
నగునూరు గ్రామానికి చెందిన ఓ యువతి అక భర్తతో కొంతకాలంగా వేధింపులను ఎదుర్కొంటున్నది. వేధింపులు తీవ్రం కాగా విసుగు చెందిన సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు ఆధారాలతో సహా యువతి బావ కొండ రామ్మోహన్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. యువతులు, వివాహితులను వేధిస్తే ఎంతటి వ్యక్తులైనా కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా మైనర్ బాలికలను నమ్మించి మాయమాటలు చెప్పి లోబరుచుకునే వ్యక్తులపై, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని సీపీ అన్నారు.