కొత్తపల్లి, జూన్ 8: బల్దియా ఆధ్వర్యంలో వేసవిలో 30 రోజుల పాటు క్రీడా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని జూడో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి పేర్కొన్నారు. బల్దియా ఆధ్వర్యంలో మానేరు పాఠశాలలో 30 రోజులుగా నిర్వహించిన జూడో వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగిసింది. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతరెడ్డి మాట్లాడారు. మానేరు విద్యా సంస్థల ఆధ్వర్యంలో త్వరలోనే జూడోలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం జూడో క్రీడకు కేరాఫ్‌గా మారడం సంతోషకరమన్నారు. జిల్లా యువజన క్రీడాశాఖాధికారి రాజవీరు మాట్లాడుతూ, వేసవి శిక్షణ శిబిరాలతో నగరంలో క్రీడలకు ఆదరణ పెరిగిందన్నారు.
విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో మార్పు సైతం వచ్చిందన్నారు. ఖేలో ఇండియా సెంటర్ కరీంనగర్‌లోని క్రీడా పాఠశాల లేదా మానేరు పాఠశాలలో ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. సుమారు 26 క్రీడాంశాల్లో 3 వేల మంది విద్యార్థులు శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు. జూడో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ, వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థులు నిత్యం సాధన చేస్తే రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం జూడో పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కడారి కృష్ణారెడ్డి, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కవిత, జూడో సంఘం పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరి మహేందర్, జూడో కోచ్‌లు శ్రీధర్‌కుమార్, సుధాకర్‌రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.