శంకరపట్నం, జూన్ 8: మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆరో రోజు బుధవారం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. కన్నాపూర్‌లో సర్పంచ్ కాటం వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రత్యేకాధికారి ఆర్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి పరశురాములు, గ్రామస్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి మరుగుదొడ్ల వాడకంపై అవగాహన కల్పించారు. వీధుల్లో తిరిగి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని తల్లిదండ్రులను కోరారు. నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు, ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చిగురుమామిడిలో..
చిగురుమామిడి, జూన్ 8: పల్లె ప్రగతిలో భాగంగా ఆరో రోజు బుధవారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఐఎస్ఎల్, వ్యక్తిగత మరుగుదొడ్లపై అధికారులు అవగాహన కల్పించారు. మండలంలోని రామంచ, ముదిమాణిక్యం, సుందరగిరి, లంబాడీపల్లి గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి నతానియల్, ఎంపీడీవో నర్సయ్య గ్రామస్తులతో మాట్లాడారు. ప్రతి ఒకరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. గాగిరెడ్డిపల్లెలో మండల ప్రత్యేకాధికారి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వినయ్, సర్పంచ్ సన్నీళ్ల వెంకటేశం ఆధ్వర్యంలో మరుగుదొడ్లపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సూర్యప్రకాశ్, సుమంత్, లావణ్య ఉన్నారు.
గన్నేరువరంలో..
గన్నేరువరం, జూన్ 8 : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఖాసీంపేటలో సర్పంచ్ గంప మల్లీశ్వరి-వెంకన్న ఆధ్వర్యంలో బుధవారం పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇంటింటికీ తిరుగుతూ ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల వాడకంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వాతి, ఎంపీవో నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ బద్ధం సంపత్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి ఆనంద్, వైద్య సిబ్బంది ఆశకార్యకర్తలు, పాలక వర్గసభ్యులు పాల్గొన్నారు.
మానకొండూర్‌లో..
మానకొండూర్ రూరల్, జూన్ 8: పల్లె ప్రగతి ఐదో విడుతలో భాగంగా మండలంలోని వెల్ది, రంగపేట, అన్నారం గ్రామాల్లో బుధవారం ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు పర్యటించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. వీధుల్లో చెత్తాచెదారం లేకుండా, డ్రైనేజీలను క్లీన్‌గా ఉంచుకోవాలని సూచించారు. కొండపల్కలలో డాక్టర్ వినత ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలకు పరీక్షలు నిర్వహించి, మందులను అందజేశారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రతేకాధికారి మోహన్, సర్పంచులు నల్ల వంశీధర్ రెడ్డి, బొట్ల కిషన్, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.