కార్పొరేషన్, జూన్ 8: నగరంలో బల్దియా ఆధ్వర్యంలో సకల సదుపాయాలతో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశామని, ప్రజలు వినియోగించుకోవాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు కోరారు. పట్టణ ప్రగతిలో భాగంగా బుధవారం 6వ రోజు నగరంలోని పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర వ్యాప్తంగా పట్టణ ప్రగతి నిధులు రూ.1.50 కోట్లతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్‌లలో మహిళలు, పురుషుల కోసం అన్ని వసతులు కల్పించామన్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించినట్లు చెప్పారు. టాయిలెట్స్ వినియోగించే వారు ఆన్లైన్లో చెల్లింపులు చేసే విధంగా ఫోన్ పే, గూగుల్ పే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో జనాభాకు అనుగుణంగా పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. వీటితో పాటు పబ్లిక్ సమావేశాలు, శుభకార్యాలు, ఇతర జనసందోహంతో కార్యక్రమాలు జరిగే చోట మహిళలకు ఇబ్బంది కలుగకుండ మొబైల్ టాయిలెట్స్ అందుబాటులో ఉంచామన్నారు. నగరంలో ప్రజలు కోరిన ప్రాంతాల్లో టాయిలెట్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ టాయిలెట్స్‌ను పర్యవేక్షించే బాధ్యతలను నగరపాలక సంస్థ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రాంనగర్ చేపల మారెట్ సమీపంలో టాయిలెట్స్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీలతో పాటు మరుగుదొడ్లను కూడా పరిశుభ్రంగా ఉంచి, ప్రజలు వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం మారెట్ వద్ద కూడా టాయిలెట్స్ నిర్మించేందుకు సాంకేతిక అనుమతులు ఇచ్చామని, త్వరలోనే పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఎస్ఈ నాగమల్లేశ్వర్రావు, ఈఈ కిష్టప్ప, మహేందర్, శానిటేషన్ సూపర్వైజర్ రాజమనోహర్, అధికారులు పాల్గొన్నారు.
కొత్తపల్లి పట్టణంలో..
కొత్తపల్లి, జూన్ 8: పట్టణంలోని 3వ వార్డులో పారిశుధ్య పనులను చైర్మన్ రుద్ర రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛ తెలంగాణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు రూపకల్పన చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వార్డులో ప్రత్యేకాధికారులను నియమించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. బడిబాటలో భాగంగా కొత్తపల్లిలోని అంగన్వాడీ కేంద్రం-4లో టీచర్ ఏరువ లలితారెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ తీశారు. కార్యక్రమంలో భారతి, అనిత, సరళ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
కరీంనగర్ రూరల్, జూన్ 8: ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ ప్రత్యేకాధికారి రాజశేఖర్ సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా మహిళా సంఘాల సభ్యులు స్వచ్ఛభారత్ నిర్వహించారు. గ్రామంలోని రోడ్లను ఊడ్చి, చెత్తాచెదారం తొలగించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పచ్చదనం, పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేకాధికారి రాజశేఖర్ మాట్లాడుతూ, పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పు శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి మల్లయ్య, ఫారూక్, మహిళా సంఘాల సభ్యులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెర్లభూత్కూర్‌లోని కొత్త చెరువు శిఖం, బహ్దుర్ఖాన్పేటలోని ప్రభుత్వ స్థలాలను మండల ప్రత్యేకాధికారి మధుసూదన్ పరిశీలించారు. గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటుకు స్థలం సేకరించి, త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, ఎంపీటీసీ తిరుపతి గౌడ్, ఆర్ఐ భవాని పాల్గొన్నారు.