చొప్పదండి, జూన్ 8: పట్టణంలో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలోని 13వ వార్డులో గల రామాలయం పరిసరాలను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వానకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సూచించారు. పట్టణంలో వరద నీటితో సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అంబటి రజిత, కౌన్సిలర్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, మున్సిపల్ మేనేజర్ ప్రశాంత్, వార్డు ప్రత్యేకాధికారి ఇమ్రాన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, జూన్ 8: మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. బహిరంగ మల విసర్జన చేయడంతో వ్యాధులు వస్తాయని గ్రామస్తులకు వివరించారు. వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి మరుగుదొడ్డిని పరిశీలించారు. ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సూచించారు. ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రామడుగు, జూన్ 8: పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని ఎంపీపీ కలిగేటి కవిత పేర్కొన్నారు. మండలంలోని రామడుగు, చిప్పకుర్తి గ్రామాల్లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఆమె ప్రత్యేకాధికారి ప్రియదర్శినితో కలిసి పాల్గొన్నారు. రెండు గ్రామాల్లో కొత్త ఇండ్ల ఆవరణలో మరుగుదొడ్ల నిర్మాణానికి ముగ్గు పోసి పనులను ప్రారంభించారు. మండల కేంద్రంలోని బేడబుడగ జంగాల కాలనీలో మరుగుదొడ్లు నిర్మించుకోని వారికి అవగాహన కల్పించారు. చిప్పకుర్తిలో ఉపాధిహామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న పల్లె ప్రగతి నిధులతో గ్రామాల్లో మురుగు కాల్వలు, రోడ్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు పూర్తయినట్లు తెలిపారు. కాగా, షానగర్లో సర్పంచ్ కవిత గ్రామస్తులకు మరుగుదొడ్డి ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి ప్రియదర్శిని, ఎంపీవో సురేందర్, సర్పంచులు పంజాల ప్రమీల, రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శులు మధుసూదన్గౌడ్, జ్యోతి, ఐఎస్ఎల్ గంగాధర డివిజన్ ఇన్చార్జి తాళ్ల వెంకటేశ్, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, పంజాల జగన్మోహన్గౌడ్, జుట్టు లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.