కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్‌షా సోయి లేకుండా మాట్లాడుతున్నడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అల్లూరి సీతారామరాజు, కుమ్రంభీం ఉద్యమించారని మాట్లాడుతుండడం ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనం. కేంద్రం తెలంగాణపై వివక్షచూపుతున్నది. ఇటీవల దేశవ్యాప్తంగా 1500 మెడికల్ కళాశాలలు మంజూరు చేసింది. కానీ, తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించుకోలేని అసమర్థుడు బండి సంజయ్. కరీంనగర్ ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన, కేంద్రంతో కొట్లాడి నిధులు తేవాలె.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కొత్తపల్లి/మానకొండూర్రూరల్, జూన్ 4: పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలతో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నదని, పల్లె, పట్టణ ప్రగతితో ఘననీయమైన అభివృద్ధి సాధించామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉద్ఘాటించారు. శనివారం మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి జిల్లాలో పర్యటించారు. ముందుగా ఐదో విడుత పల్లె ప్రగతిలో భాగంగా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి మానకొండూర్ మండలం లింగాపూర్‌కు రాగా, మహిళలు బతుకమ్మ, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం 2 కోట్లతో నిర్మించిన సబ్‌స్టేషన్, మహిళా భవనాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఆయాచోట్ల ఏర్పాటు చేసిన గ్రామసభలకు హాజరై, మాట్లాడారు. ఈ ప్రాంత బాగుకు మంత్రి గంగుల విశేషంగా కృషిచేస్తున్నారని, ఇలాంటి సమర్థుడైన నాయకుడు కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం ప్రజల అదృష్టమన్నారు. రైతులను ఆదుకోవాలని సీఎం ఆలోచన చేస్తున్నప్పుడు పట్టుబట్టి ధాన్యం కొనుగోలు చేసేలా ఒప్పించి ప్రశంసలు పొందారని గుర్తు చేశారు. దేశంలో ఇంతవరకు పనిచేసిన సీఎంలలో కేవలం ఇద్దరు మాత్రమే తనకు నచ్చారని, అందులో ఒకరు ఎన్టీఆర్ అయితే మరొకరు సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. రైతుబంధు కింద ఎకరాకు 10వేల పెట్టుబడి అందిస్తున్న గొప్ప నాయకుడని కేసీఆర్ అని కొనియాడారు. రైతు బిడ్డలెవరూ కేసీఆర్‌కు ద్రోహం చేయరన్నారు.
24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలు ఒక్క రాష్ట్రంలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనూ ఈ పథకాలు లేవన్నారు. మంచం కింద పడుకొని లేసొచ్చి అది చేస్తాం… ఇది చేస్తాం అంటున్న కాంగ్రెస్ నాయకులు, వారు పాలించే రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పింఛన్ 500 మాత్రమే ఇస్తున్నారని, అదీ ఆరు నెలలకోసారి మాత్రమే ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కరోనా ప్రభావంతో ప్రపంచమే అతలాకుతలమైనా తెలంగాణ మాత్రం పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి 400కి పైగా కొత్త పెన్షన్లు వస్తాయన్నారు. సొంతస్థలం ఉన్న పేదలకు ఇల్లు కట్టుకుంటే త్వరలో 3.10 లక్షలు ఇస్తామని, నియోజకవర్గానికి 3వేల మందికి అందిస్తామన్నారు. అలాగే 1500 మందికి దళితబంధు ఇస్తామని చెప్పారు. మల్కాపూర్ గ్రామాభివృద్ధికి కోటి నిధులను మంజూరు చేస్తున్నానని, మండలంలోని మిగతా గ్రామాలకు సైతం నిధులను అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఐకేపీ, శ్రీ నిధి పథకాల కింద కరీంనగర్ జిల్లాకు 5 కోట్లు నిధులను మంజూరు చేస్తానని, మంచి ప్రాజెక్టుతో వచ్చే మహిళల స్వయం ఉపాధికి ఒక్కొక్కరికి 3 లక్షల వరకు నిధులు అందజేస్తామని చెప్పారు. మానకొండూర్ నియోజక వర్గానికి ఇప్పటికే 52 కోట్లు నిధులు మంజూరు చేశామని, లింగాపూర్‌లో సీసీరోడ్లకు 50లక్షలు ఇచ్చామని చెప్పారు.
కల్యాణ లక్ష్మి సాయాన్ని పెండ్లికి ముందే ఇచ్చేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. ఆ తర్వాత అనారోగ్యం బారినపడి కోలుకున్న సర్పంచ్ పొల్సాని మురళీధర్ రావును మంత్రు లు, ఎమెల్యే పరామర్శించారు. కాగా, లింగాపూర్‌కు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేకు మహిళలు కోలాటం ఆడుతూ, బతుకమ్మలు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ విజయ, కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీపీవో వీర బుచ్చయ్య, డీఆర్డీవో శ్రీలత, కొత్తపల్లి, మానకొండూర్ ఎంపీడీవోలు శ్రీనివాస్‌రెడ్డి, దివ్యదర్శన్ రావు, మల్కాపూర్ సర్పంచ్ గొట్టె జ్యోతి పోచయ్య, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, ఎంపీవో దొంత శ్రీనివాస్, ఎంపీటీసీలు భూక్యా తిరుపతినాయక్, మంద రమేశ్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
పల్లె, పట్టణ ప్రగతి తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేవు. వీటితో చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు శుభ్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామాలు స్వచ్ఛంగా తయారవుతున్నాయి. అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. ప్రజలంతా భాగస్వాములు కావాలి.
– కలెక్టర్ ఆర్వీ కర్ణన్