సర్కారు బడి సరికొత్తగా మారబోతున్నది. పాఠశాల విద్య బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర సర్కారు, ‘మన ఊరు- మన బడి’ కింద మరింత అభివృద్ధి చేయాలని సంకల్పించింది. స్కూళ్ల అవసరాలేంటి..? ఏమేం పనులు చేయాలి..? అనే పూర్తి వివరాలు తెలుసుకొని ప్రణాళికలు కూడా తయారు చేసింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 172 స్కూళ్లను ఎంపిక చేసి, తొలి విడుత రూ.2 కోట్లు మంజూరు చేసింది. ఆయా విద్యాలయాల్లో మొత్తం 2,064 పనుల కోసం ప్రతిపాదనలు పంపడంతోపాటు తాజాగా 40 పనులను ప్రారంభించింది. ముందుగా కిచెన్ షెడ్లు, టాయిలెట్లు నిర్మిస్తున్నది. పనులన్నీ ఏడాదిలోపే పూర్తయి స్కూళ్ల రూపురేఖలన్నీ మారిపోనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– రాజన్న సిరిసిల్ల, జూన్ 4 (నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సర్కారు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నది. కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన అందిస్తూ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పిస్తున్నది. కొత్తగా ‘మన ఊరు మన బడి’ అనే వినూత్న కార్యక్రమం కింద స్కూళ్లన్నింటినీ మరింత అభివృద్ధి చేయాలని, కావాల్సిన వసతులన్నీ కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 489 పాఠశాలలకుగాను 172 పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందు కోసం తొలి విడతగా రూ.2కోట్ల నిధులు మంజూరు చేయగా, ఇంజినీరింగ్, గ్రామీణాభివృద్ధిసంస్థ, విద్యాశాఖ సంయుక్తంగా అంచనాలను రూపొందిస్తున్నాయి. కార్యక్రమం కింద త్వరలోనే బడుల రూపురేఖలన్నీ మారిపోనుండగా, తల్లిదండ్రుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
172 పాఠశాలల ఎంపిక
మనఊరు- మనబడి’లో భాగంగా పాఠశాలలను అన్ని హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో విద్యాశాఖ, ఇంజినీరింగ్, గ్రామీణాభివృద్ధి సంస్థలు భాగస్వామ్యంతో పాఠశాలలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలపై అంచనాలు రూపొందిస్తున్నాయి. శిథిలమైన తరగతి గదులు, ప్రహరీలు, మరుగుదొడ్లు, డైనింగ్ హాళ్లు, కిచెన్ షెడ్లు, విద్యుత్, కిటికీలు, తలుపులు.. ఇలా 12 రకాల అవసరాలను గుర్తించింది. ఇందు కోసం అవసరమయ్యే నిధుల అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తున్నది. జిల్లాలో 489 పాఠశాలలుండగా, అందు లో 13 మండలాల నుంచి 172 పాఠశాలలను ‘మన ఊరు మనబడి’ పథకం కింద ఎంపిక చేశారు. చేపట్టిన పనుల వివరాలు పంపించాలని సంబంధిత మండల విద్యాశాఖ అధికారులను జిల్లా విద్యాశాఖ ఆదేశించింది. మండల ఎంఈవోలు పంపిన పనుల వివరాలను ఇంజినీరింగ్ గ్రామీణాభివృద్ధి సంస్థ, విద్యాశాఖలు పనులకు అవసరమయ్యే నిధుల అంచనాలను రూ పొందిస్తున్నాయి. కాగా, కార్యక్రమం విజయవంతానికి కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులతో పలుమార్లు సమీక్షించి దిశానిర్ధేశం కూడా చేశారు.
తొలి విడత రూ.2కోట్ల నిధులు..
సర్కారు ఎంపిక చేసిన 172 పాఠశాలల్లో 2,064 పనుల కోసం అధికారులు ప్రతిపాదనలు చేయ గా, ప్రభుత్వం పరిపాలన అనుమతులనిచ్చింది. ఈ మేరకు తొలివిడతగా రూ.2కోట్లు మంజూరు చేయ గా, 16 పాఠశాలల్లో 40 పనులను అధికారులు ప్రా రంభించారు. మొత్తం పనులకు రూ.100 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి సంస్థ కిచెన్షెడ్లు, టాయిలెట్ల నిర్మాణాలు చేపడుతున్నది. ఇవి పూర్తయితే చెట్ల కింద మధ్యాహ్నం భోజనం వంట ఇబ్బందులు తీరనున్నాయి. ఇంకా అనేక పాఠశాల లు ప్రహరీలు లేవు. తలుపులు, కిటీకీలు శిథిలమైన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు ఒకేసారి పెద్దసంఖ్యలో కూర్చుండి భో జనం చేసేలా డైనింగ్ హాల్ నిర్మించనున్నారు. ఇవేకాదు ఇంకా మరిన్ని వసతులు కల్పించనుండగా, త్వరలోనే బడుల రూపురేఖలన్నీ మారిపోనున్నాయి.
మంచి కార్యక్రమం..
పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మనఊరు మనబడి’ గొప్ప కార్యక్రమం. పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వం, కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది కలిసి విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా 172 పాఠశాలల్లో చేపట్టాల్సిన పనుల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభించాం. పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. కార్పొరేట్‌కు దీటుగా పాఠశాలల్లో వసతులు సమకూరనున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తుంది.
– రాధాకిషన్, జిల్లా విద్యాధికారి