పారిశుధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సహకరించాలని ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు కోరారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా శనివారం వీధుల్లో పర్యటించారు. పారిశుధ్య పనులను పరిశీలించడంతో పాటు ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలు, ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
హుజూరాబాద్ పట్టణంలో..
హుజూరాబాద్ టౌన్, జూన్ 4: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం శానిటేషన్ డే నిర్వహించారు. చైర్పర్సన్ గందె రాధిక పట్టణంలోని 3, 15, 16, 28వ వార్డులను సందర్శించగా, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల 7వ వార్డులో పర్యటించారు. పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకన్నతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ హుజూరాబాద్ పట్టణ సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.42 లక్షలు కేటాయిస్తున్నదని తెలిపారు. ఆ నిధులతో వార్డుల్లోని సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మకపల్లి కుమార్ యాదవ్, కల్లేపల్లి రమాదేవి మారేపల్లి సుశీల, ఇన్చార్జి మున్సిపల్ ఇంజినీర్ జీ సాంబరాజు, టౌన్ ప్లానింగ్ అధికారులు జ్యోత్స్న, అశ్వినిగాంధీ, శానిటరీ ఇన్స్పెక్టర్ పీ అనిల్‌కుమార్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, వార్డు ప్రత్యేకాధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట పట్టణంలో..
జమ్మికుంట, జూన్ 4: పట్టణ ప్రగతిలో భాగంగా శనివారం మున్సిపల్ పరిధిలోని 18, 20వ వార్డుల్లో పరిసరాలను శుభ్రం చేశారు. ఎక్స్కవేటర్ సహాయంతో కాలనీ రోడ్డు వెంబడి ఉన్న పిచ్చి చెట్లు, చెత్తా చెదారాన్ని తొలగించారు. వార్డుల్లోని డ్రైనేజీలో ఉన్న సిల్ట్‌ను తీశారు. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు దేశిని రాధ, జుగురు సదానందం తదితరులు దగ్గరుండి పనులను పరిశీలించారు. ఆయా కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొదటి ప్రాధాన్యత పనులను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇక్కడ నాయకులు సదానందం, బొద్దుల రవీందర్, అధికారులు చంద్రకళ, రాజేందర్, భూపాల్‌రెడ్డి, తదితరులున్నారు.
సైదాపూర్‌లో..
సైదాపూర్, జూన్ 4: పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మండల ప్రత్యేకాధికారి రాజమనోహర్‌రావు కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పల్లెప్రగతి ఎంతో దోహదపడుతున్నదన్నారు. పలు గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు భూమి పూజ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పద్మావతి, ఎంపీవో రాజశేఖర్‌రెడ్డి, సర్పంచులు కొండ గణేశ్, కొత్త రాజిరెడ్డి, గాజర్ల సదానందం, మ్యాకల శిరీషాముకుందరెడ్డి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
వీణవంకలో..
వీణవంక, జూన్ 4: 5వ విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. వల్భాపూర్ గ్రామంలో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంట్లో మ్యాజిక్ ఇంకుడు గుంత నిర్మించుకులా ప్రోత్సహించాలని చెప్పారు. మురుగు కాల్వల చివరన నీరు నిల్వకుండా కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పల్లెప్రగతిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, ఏఈవో సంగీత, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రత్యేకాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట మండలంలో..
జమ్మికుంట రూరల్, జూన్ 4: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు మండలంలోని గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అన్ని గ్రామాల్లోని వార్డుల్లో వారు తిరుగుతూ పారిశుధ్య పనులను పరిశీలించారు. చెత్త, పిచ్చి మొక్కలను తొలగించారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.