కరీంనగర్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రెండో రోజూ శనివారం జిల్లాలో విస్తృతంగా నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాదయాత్రలు నిర్వహించి, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. వీధులను శుభ్రం చేయించారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తీయించారు. ముఖ్యంగా పాడుబడిన, శిథిలమైన కట్టడాలను తొలగించారు. అధికారులు ముఖ్యంగా ఇంటింటికీ మ్యాజిక్ సోక్ పిట్ కట్టుకోవాలని, సింగిల్ యూజ్డ్ ప్లాస్లిక్‌పై అవగాహన కల్పించారు.
మానకొండూర్ మండలం లింగాపూర్, కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో జరిగిన పల్లెప్రగతిలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. లింగాపూర్‌లో విద్యుత్ ఉపకేంద్రాన్ని, మల్కాపూర్‌లో క్రీడా మైదాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లె ప్రగతి విశిష్టతను వివరించారు. లింగాపూర్‌లో జరిగిన కార్యక్రమాల్లో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు. గంగాధర మండలం కురిక్యాలలో జరిగిన పల్లె ప్రగతిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో పాల్గొన్నారు.