కరీంనగర్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్, నీటి సమస్యలు అధికంగా వస్తుంటాయని, వాటిని పరిషరించడంతో పాటు తిరిగి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పల్లె, పట్టణ ప్రగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, వైకుంఠధామాలు, పాఠశాలలు, అంగన్వాడీలకు నీటి సరఫరా అందించాలని, ఇబ్బందులుంటే అకడ బోర్వెల్ ద్వారా నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తుప్పుపట్టిన, వంగిన, విరిగిన కరెంట్ పోల్స్‌ను తొలగించాలని, లూజ్ వైర్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్మార్ట్ సిటీలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, ఇందుకోసం విద్యుత్ శాఖ డీఈ రాజిరెడ్డిని నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. విద్యుత్ వైర్ల కింద ఉన్న చెట్ల కొమ్మలను కొట్టే ముందు మున్సిపల్ అధికారులకు సూచించాలని, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేసిన కంచె వద్ద పిచ్చి మొకలు లేకుండా చూడాలని ఆధికారులను ఆదేశించారు. అన్ని వైకుఠధామాలకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వినియోగించాలని, 400 మీటర్ల దూరంలో ఉన్నట్లయితే పోల్స్ ఏర్పాటు చేయాలన్నారు.
నీటి సౌకర్యం ఉండేలా చూడాలని, వాటి బిల్లులను గ్రామపంచాయతీ చెల్లిస్తుందని పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామపంచాయతీ నుంచి పట్టణం వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో స్థానికసంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డీపీవో వీరబుచ్చయ్య, విద్యుత్, మున్సిపల్ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఏపీఎంలున్నారు.