మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రెండో రోజు శనివారం ప్రత్యేకాధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని వీధుల్లో పర్యటించారు. ప్రత్యేక పారిశుధ్య పనులను పరిశీలించారు. స్థానిక సమస్యలను గుర్తించడంతో పాటు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించి, వానకాలం ప్రారంభంకానున్న దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
శంకరపట్నంలో..
శంకరపట్నం, జూన్ 4: పల్లె ప్రగతిలో భాగంగా 2వ రోజు మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎరడపల్లి, తాడికల్, కేశవపట్నం గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను మండల ప్రత్యేకాధికారి ఎన్ అంజనీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, భవిష్యత్ తరాలకు ఎదురయ్యే అనర్థాలను నివారించాలని ప్రజలను కోరారు. క్లాత్, జ్యూట్ బ్యాగ్స్ వంటి ప్రత్యామ్నాయాలకు మళ్లాలని సూచించారు. ఎరడపల్లిలో పురాతన భవన శిథిలాలను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు. కేశవపట్నంలో క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి, ప్రారంభానికి తుది మెరుగులు దిద్దాలని చెప్పారు. సర్పంచులు బండారి స్వప్న, కీసర సుజాత, గ్రామ ప్రత్యేకాధికారులు జనార్దన్, లక్ష్మీప్రసూన, భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు సమ్మ రాజేశ్వర్, రవీందర్, గురవయ్య, కారోబార్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
చిగురుమామిడిలో..
చిగురుమామిడి, జూన్ 4: మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా శనివారం మురుగు కాలువలు, పారిశుధ్య పనులను అధికారులు పరిశీలించారు. శిథిలమైన ఇండ్లను గుర్తించారు. ములనూర్, చిగురుమామిడి తదితర గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి నతానియెల్, ఎంపీడీవో నర్సయ్య, ఎంపీవో శ్రావణ్ కుమార్ పర్యటించారు. అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గన్నేరువరంలో..
గన్నేరువరం, జూన్ 4: ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెరుగుతాయని, ప్రతి ఇంటా వాటిని ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్ అటికం శారదాశ్రీనివాస్ కోరారు. 5వ విడుత పల్లె ప్రగతి పనుల్లో భాగంగా శనివారం అధికారులతో కలిసి వాడవాడలా తిరుగుతూ ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రజలకు ఆమె అవగాహన కల్పించారు. ఇంట్లో ఉపయోగించిన నీరు ఇంకుడు గుంతలోకి వెళ్లేలా చూడాలని, ఏ ఒక్కరూ నీటిని వృథాగా మురుగు కాలువల్లోకి వదలకూడదని పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి రవళి, సెక్రటరీ లచ్చయ్య, అంగన్వాడీ టీచర్ రజిత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
తిమ్మాపూర్‌లో..
తిమ్మాపూర్ రూరల్, జూన్ 4: మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వీధుల్లో తిరుగుతూ పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. వానకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులు ప్రబలవని చెప్పారు. పల్లెప్రగతి పనులను ప్రత్యేకాధికారులు, మండల అధికారులు పర్యవేక్షించారు.
మానకొండూర్‌లో..
మానకొండూర్ రూరల్, జూన్ 4: మండలంలోని గట్టుదుద్దెనపల్లి, ముంజంపల్లి, వెల్ది, కొండపల్కల, గంగిపల్లి, ఊటూర్, వన్నారం తదితర గ్రామాల్లో శనివారం పల్లె ప్రగతిలో భాగంగా వివిధ పనులను నిర్వహించారు. ప్లాస్టిక్ వేస్ట్‌ను తొలగించడం, డ్రైనేజీల పరిశుభ్రం తదితర పనులు చేశారు. 3వ రోజు చేసే పనుల ప్రణాళికలను తయారు చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.