కార్పొరేషన్, జూన్ 4: నగరంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం రెండోరోజు ఉత్సాహంగా సాగింది. శనివారం 60 డివిజన్లలో ర్యాలీలు తీశారు. ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు, అధికారులు సమస్యలను గుర్తించారు. ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్త, మురుగు కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టారు. తొమ్మిదో డివిజన్లో జరిగిన కార్యక్రమానికి మేయర్ వై.సునీల్‌రావు, కమిషనర్ సేవా ఇస్లావాత్ హాజరయ్యారు. డివిజన్లోని కోతిరాంపూర్, అలకాపురిలో స్థానిక కార్పొరేటర్ జంగిలి ఐలేందర్యాదవ్తో కలిసి పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. స్మార్ట్‌సిటీలో నిర్మిస్తున్న డ్రైనేజీ అభివృద్ధి పనులను పరిశీలించారు.
పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్మికుల యోగ క్షేమాలు తెలుసుకొని, నగరపాలక సంస్థ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. డివిజన్ల వారీగా సమస్యలను గుర్తించి ప్రాధాన్యతాక్రమంలో పరిషరించుకుంటామని తెలిపారు. మొకలు నాటేందుకు ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యనైనా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. తొమ్మిదో డివిజన్ అలకపురిలోని డ్యాం సీఫేజ్ వాటర్ సమస్యను పరిషరించేందుకు పెద్ద స్టాం వాటర్ డ్రైన్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పనులు తుది దశకు వచ్చాయన్నారు. వానకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
35వ డివిజన్లో కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు, డ్రైనేజీల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టారు. 18వ డివిజన్లో కార్పొరేటర్ సుధగోని మాధవి ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. గౌడ కాలనీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలపై సమీక్షించారు. మూడో డివిజన్లో కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయా కాలనీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. దశలవారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.