కరీంనగర్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కరీంనగర్ జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నదని కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణ రాష్ర్టానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. సమైక్య పాలన నుంచి విముక్తి పొందిన తెలంగాణ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ముం దు చూపు, కార్యదక్షతనే ఇందుకు కారణమని స్పష్టం చేశారు. ఆయన మాటల్లోనే..
అన్నదాతకు అనేక పథకాలు..
రైతును రాజును చేసే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలను అమలు చేస్తున్నారు. రైతు బంధు కింద చివరి యాసంగిలో 1,77,451 మంది రైతులకు 776.72 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించారు. వివిధ కారణాలతో 318 మంది మరణించగా, ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున 15.90 కోట్లు రైతు బీమా కింద అందించారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం.
దళితుల జీవితాల్లో వెలుగులు..
సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టారు. అంబేదర్ స్ఫూర్తితో దళిత బంధును తెచ్చారు. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో 17,554 దళిత కుంటుంబాలను గుర్తించి, ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున 1,755.40 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. ఇప్పటి వరకు 9,548 మంది లబ్ధిదారులకు 8,459 యూనిట్లను గ్రౌండింగ్ చేశాం. ఈ పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో దశల వారీగా అమలు చేస్తున్నాం.
కులవృత్తులకు పునరుజ్జీవం..
గ్రామీణ ప్రాంతాల్లో ఇతర వృత్తులకు సీఎం కేసీఆర్ పునరుజ్జీవం పోస్తున్నారు. గొల్ల కుర్మల కోసం గొర్రెల యూనిట్ల పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో రెండో విడతలో 13,409 మంది లబ్ధిదారులను గుర్తించి ఇప్పటి వరకు 3,586 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేశాం. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2.30 కోట్లతో ఒక రిజర్వాయర్‌తోపాటు 800 చెరువుల్లో 2.11 కోట్ల చేప పిల్లలను వదిలాం. అలాగే ఒక రిజర్వాయర్, ఏడు చెరువులలో 88 లక్షలతో 34 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేశాం. నేత కార్మికులకు అవసరమైన నూలు, రసాయన కొనుగోలుపై 40 శాతం రాయితీ అందిస్తున్నాం.
పల్లె పట్టణ, పట్టణ ప్రగతి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె, పట్టణ ప్రగతి చేపట్టింది. విడతల వారీగా కార్యక్రమాలను చేపట్టాం. ప్రతి గ్రామంలో నర్సరీలు, డంప్ యార్డ్లు, వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, కంపోస్ట్ షెడ్లు నిర్మించాం. జిల్లాలోని 313 గ్రామాల్లో పారిశుధ్యం, హరితహారం పనుల నిర్వహణకు 445 ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను, ట్రైసైకిళ్లను వినియోగిస్తున్నాం. మన గ్రామాలు, పట్టణాలు దేశ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి, శంకరపట్నం మండలం ధర్మారం ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద అవార్డులు అందుకున్నాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సశక్తీకరణ్ పురసార్ కేటగిరీ కింద రామడుగు మండలం వెలిచాలకు అవార్డు వచ్చింది. ఈ నెల 3 నుంచి 5వ విడత పల్లె, 4వ విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ భాగస్వాములు కావాలి.
సమర్థవంతంగా కొవిడ్ సేవలు..
కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదురుర్కొన్నాం. వైరస్ కట్టడిలో వైద్యులు, పోలీసుల పనితీరు బాగుంది. ప్రస్తుతం జిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ప్రజలు భయపడవలసిన అవసరం లేదు. ప్రభుత్వ దవాఖానల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఓపీ సేవలందిస్తున్నాం. కరీంనగర్ ప్రధాన దవాఖానలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లో వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నాం. ఇదే దవాఖానలో 21 కేఎల్ సామ ర్థ్యం గల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాం. పేషెంట్లకు ఆక్సిజన్, మందులు, ఇంజెక్షన్ల కొరత లేకుండా చూస్తున్నాం. కొవిడ్ టీకా కార్యక్రమంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సతారం పొందడం గర్వకారణం. జిల్లాలో కొవిడ్ నియంత్రణకు ఉత్తమ సేవలందించిన ఐదు పీహెచ్‌సీలకు లక్ష చొప్పున ప్రోత్సాహం అందించాం.
కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ వైద్యం..
కార్పొరేట్‌కు దీటుగా సర్కారు దవాఖానల్లో వైద్య సేవలందిస్తున్నాం. 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్య సేవలందిస్తున్నాం. నెలకు 800 నుంచి 900 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 44,500 కేసిఆర్ కిట్లను అందించాం.
పరిశ్రమల విస్తరణకు చేయూత..
జిల్లాలో 232 కోట్లతో 135 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేశాం. వీటి ద్వారా 2,973 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. ప్రధానమంత్రి ఎంప్లాయీమెంట్ జనరేషన్ పథకం కింద 3.19 కోట్ల మార్జిన్ మనీతో 97 పరిశ్రమలు ఏర్పాటు చేశాం. టీ ప్రైడ్ పథకం కింద 144 మంది ఎస్సీ లబ్ధిదారులకు పెట్టుబడి, పావుల వడ్డీ రాయితీ మంజూరు చేశాం. 24 మంది ఎస్టీ అభ్యర్థులకు 25 లక్షలు, ఏడుగురు వికలాంగులకు 20. 52 లక్షల పెట్టుబడి రాయితీ మంజూరు చేశాం.
సుందర నగరంగా కరీంనగర్..
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 1,878 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మూడు ప్యాకేజీలలో 290 కోట్లతో 47 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం పనులు, సైడ్ డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌లు నిర్మించాం. అంబేదర్ స్టేడియంలోని ఇం డోర్ స్టేడియం ఆధునీకరణ పనులు పూర్తి చేశాం. ఐబీ జంక్షన్, నాకా చౌరస్తా, జంక్షన్ల సుందరీకరణ పనులు పూర్తి చేశాం. 648 కోట్లతో స్మార్ట్ సిటీ మిషన్ కింద నగరానికి 24 గంటల తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కశ్మీర్గడ్డలో సమీకృత మారెట్ పనులు ప్రగతిలో ఉన్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా 16.82కోట్లతో 15 పబ్లిక్ టాయిలెట్స్, 25 ఓపెన్ జిమ్స్, 6 గ్రేవీయార్డ్ పార్స్, 3 పారుల నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి. 20.30 కోట్లతో కిసాన్‌నగర్‌లో సమీకృత వెజ్ అండ్ నాన్-వెజ్ మారెట్ను, 4 కోట్లతో 2 వైకుంఠ ధామాలు నిర్మిస్తున్నాం. మంత్రి కేటీఆర్ మార్చి 17న కరీంనగర్లో 1,065 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇవి పూర్తయితే నగరం సుందర నగరంగా మారుతుంది. మానేరుపై నిర్మిస్తున్న తీగల వంతెన నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. అలాగే 410 కోట్లతో చేపట్టిన మానేరు రివర్ ప్రంట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
పోలీసుల సేవలు భేష్..
జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వేళ అలుపెరుగని సేవలందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు భరోసా కల్పిస్తూనే.. అక్రమారుల గుండెల్లో సింహ స్వప్నంగా నిలుస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ వినియోగంతో కేసులను త్వరగా చేధిస్తున్నారు. సాంకేతిక పరికరాలను వినియోగి స్తూ వాట్సాప్, హాక్ఐ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులపై సత్వరం స్పందించి 195 మంది పోకిరీలను పట్టుకున్నారు. మానేరు రిజర్వాయర్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించిన 35 మందిని లేక్ కాపాడారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, మేయర్ వై సునిల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, జడ్పీ సీఈవో ప్రియాంక, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ తదితరులు పాల్గొన్నారు.