జగిత్యాల కలెక్టరేట్, జూన్ 2: ప్రజల సుదీర్ఘ పోరాటం, అమరుల త్యాగాల ఫలితంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం.. ఈ ఎనిమిదేండ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, వయోవృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చేపట్టిన జిల్లాల పునర్విభజన మంచి ఫలితాలు ఇస్తున్నదని చెప్పారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం జగిత్యాల కలెక్టరేట్లో జాతీయ పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. వ్యవసాయ రంగం బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని విశ్వసించిన సీఎం కేసీఆర్, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారిగా రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చి పెట్టుబడి సాయం అందిస్తున్నారని, ఇక ఏదైనా కారణంతో రైతు చనిపోతే కుటుంబం రోడ్డున పడకుండా రైతు బీమా అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం విద్యా, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నదన్నారు. ప్రభుత్వ బళ్లను మరింత అభివృద్ధి చేసేందుకు రూ.7500 కోట్ల వ్యయంతో సీఎం కేసీఆర్ ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాల, అనుబంధ దవాఖాన నిర్మిస్తుదన్నారు. రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశామని, ఇది సీఎం కేసీఆర్ ఘనతేనని కొనియాడారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎస్సారెస్పీ కాలువల ద్వారా చివరి ఆయకట్టుకూ నీరించేందుకు ‘జలహితం జనహితం’ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని మంత్రి చెప్పారు.