సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 2 : ప్రజల సమస్యలను ఓపిగ్గా వింటూ.. అప్పటికప్పుడే పరిష్కారం చూపారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం రాజన్నసిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరైన ఆయన, వేడుకల అనంతరం కలెక్టరేట్లోని ఐడీవోసీ మీటింగ్ హాలులో అధికారులు ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సమయంలో మంత్రిని కలిసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఐడీఓసీకి వచ్చారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వారిని నిరాశపరచకుండా మంత్రి ప్రతి ఒక్కరి నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. వారి సమస్యలను ఓపిగ్గా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిందిగా అక్కడే ఉన్న కలెక్టర్ అనురాగ్జయంతి, అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో బిజీగా ఉన్నప్పటికీ తమ విజ్ఞప్తులను స్వీకరించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.