సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, జూన్ 2: రాజన్నసిరిసిల్ల జిల్లాలో కమలం పార్టీకి భారీ షాక్ తగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు, గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ ఆ పార్టీని వీడారు. బుధవారమే రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణకు సమర్పించారు. గురువారం సిరిసిల్లలో మరో ఐదుగురు నేతలతో కలిసి మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి అమాత్యుడు గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీధర్ కేటీఆర్‌ను అభినందించారు. ఆయనకు సముచిత గౌరవమిస్తామని హామీ ఇచ్చారు. పాత, కొత్త అనేతేడాలేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పార్టీ లో చేరిన వారిలో గంభీరావుపేట మాజీ సర్పంచ్ అక్కపల్లి బాలయ్య, సిరిసిల్ల జిల్లా సాధన కమిటీ కన్వీనర్ అబ్దుల్ మజహర్, లక్కిరెడ్డి కృష్ణారెడ్డి, రాజేశ్గాంధీ, నర్మాల బీజేపీ గ్రామాధ్యక్షుడు బాల్నర్సు ఉన్నారు.
గ్రామాభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరిన. బీజేపీలో ఉండడం వల్ల ఇది సాధ్యం కావడం లేదు. ప్రభుత్వ సహకారంతో ఉత్సాహంగా పనిచేసి గంభీరావుపేటను ఆదర్శంగా నిలుపుత. జెండాలు, ఎజెండాలు పక్కనబెట్టి గులాబీ గూటికి చేరిన. మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుంచుత.
– బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన అనంతరం సర్పంచ్ కటకం శ్రీధర్