కరీంనగర్, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :సంస్కృతీ సంప్రదాయాల విధ్వంసం.. భాష, యాసను వక్రీకరించడం.. నీళ్లు, నిధులు, నియామకాలను తన్నుకెళ్లడం.. ఇలా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించ పరిచే తరుణంలో.. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా నాటి ఉద్యమ సారథి కేసీఆర్ సమరశంఖం పూరించారు. కరీంనగర్ గడ్డ వేదికగా ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, సకల జనులను ఏకం చేసి మలిదశ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. పద్నాలుగేండ్లు అలుపెరగని యుద్ధం చేసి.. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. అధికార పగ్గాలు చేపట్టిన ఎనిమిదేళ్లలోనే.. యావత్ దేశం అబ్బురపడేలా రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఉమ్మడి గడ్డ వేదికగా 24గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు లాంటి పథకాలకు అంకురార్పణ చేసి, సబ్బండ వర్గాల సంక్షేమానికి బాటలు వేశారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ముందుకు సాగి, కాళేశ్వరం ఎత్తిపోతలతో నీటి కలను సాకారం చేశారు. పల్లె నుంచి పట్నం దాకా నిధుల వరద పారించి, అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఇక నియామకాల ప్రక్రియను చేపట్టి, దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా 80వేలకుపైగా పోస్టులను భర్తీ చేసేందుకు విడుతల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమానికి ఉమ్మడి జిల్లా ఆది నుంచీ అండగా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర సాధన వరకు జరిగిన ప్రతి ఘట్టానికి వేదికైంది. రాష్ట్ర అవతరణ తర్వాత కూడా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలకు.. ఆదర్శంగా నిలించే పథకాలకు ఇక్కడే అంకురార్పణ జరిగింది. కరీంనగర్ కేంద్రంగా తీసుకున్న ఏ కార్యక్రమమైనా విజయవంతమై, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉమ్మడి జిల్లా సెంటిమెంట్‌గా మారింది. నాటి ఉద్యమం మొదలు రాష్ట్ర సాధన, నేటి కొలువు జాతర దాకా ఈ గడ్డ ప్రత్యేకంగా నిలుస్తున్నది. ఇక్కడ ప్రజానీకం కేసీఆర్ వెంటే కదులుతున్నది.
2001 ఏప్రిల్ 27న కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీడీపీకి, తన శాససభా సభ్యత్వానికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ ఆవిర్భావానికి నాంది పలికారు.
2001 మే17న కరీంనగర్ ఎస్సారార్ కళాశాల వేదికగా నిర్వహించిన ‘సింహగర్జన సభ’లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటును ప్రకటించారు. లక్షలాది మంది సాక్షిగా తెలంగాణ వచ్చేదాకా మడమ తిప్పబోనని ప్రతినబూనారు. ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఈ సభ విజయవంతమైన ఘనత ఈ గడ్డకు దక్కింది.
2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 ఎంపీటీసీలు, 85 జడ్పీటీసీలు, 3వేల మంది సర్పంచులు, రెండు జిల్లా పరిషత్ స్థానాలను కైవసం చేసుకున్నది. అందులో కరీంనగర్ జిల్లా పరిషత్ కూడా ఉన్నది.
2004లో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలికిన కేసీఆర్, తనదైన శైలిలో చక్రం తిప్పి, అదే ఏడాది జూన్ 7న రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించేలా చేశారు. ఆ సమయంలో కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. ఈ ఘనత కూడా ఈ గడ్డకే దక్కింది.
2005 జనవరిలో కేంద్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు కూడా టీఆర్ఎస్ విజయమే.
2006 సెప్టెంబర్ 12న కరీంనగర్ లోక్‌సభ స్థానానికి కూడా కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణ వాదం లేనేలేదంటూ నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అవహేళన మాటలతో కలతచెందిన ఆయన, పదవిని తృణప్రాయంగా భావించారు. తెలంగాణ కోసం పదవుల త్యాగానికి శ్రీకారం చుట్టిన ఘనత ఈ ప్రాంతానికి దక్కింది.
2006 డిసెంబర్ 7న కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో 2,01,582 ఓట్ల మెజార్టీనిచ్చి ఈ గడ్డ ప్రజలు కేసీఆర్‌ను గెలిపించారు. ప్రత్యేక తెలంగాణవాదం ఉందని నలుమూలలా చాటి చెప్పిన చరిత్ర ఉమ్మడి జిల్లా ప్రజలకు దక్కింది. ఈ ఎన్నిక టీఆర్ఎస్కు రాజకీయ పునర్జన్మనిచ్చింది.
2009 నవంబర్ 11న ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్ నుంచి బయలు దేరిన కేసీఆర్‌ను అల్గునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు ఈ ప్రాంత ప్రజలు ఎదురేగి కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు. ఈ గడ్డపై జరిగిన అరెస్టు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
2011 సెప్టెంబర్ 23న సకలజనుల సమ్మెకు కరీంనగర్ గడ్డ మీద నుంచే ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన సభలో సకలజనుల చారిత్రక సమ్మెకు రణభేరీ మోగించారు. ఈ సమ్మె యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది.
2014 ఏప్రిల్ 13న ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు శ్రీ రాజరాజేశ్వర కళాశాల వేదికగా జరిగిన బహిరంగ సమావేశంలో తొలి సమర శంఖారావం పూరించారు. అద్భుత విజయాన్ని సాధించి తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. తర్వాత ఉమ్మడి జిల్లా వేదికగా హరితహారం. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం శంకుస్థాపన, రైతు సమన్వయ సమితులు, రైతు బీమా, రైతుబంధు, మిషన్ భగీరథ వంటి ప్రతిష్టాత్మక పథకాలను ఈ గడ్డమీద నుంచే ముఖ్యమంత్రి ప్రకటించారు.
కరువునేల సస్యశ్యామలం..
సమైక్య రాష్ట్రంలో కరీంనగర్ అంటేనే కరువు జిల్లా.. ఎటుచూసినా నెర్రలువారిన భూములు.. అడుగంటిన భూగర్భ జలాలు.. అన్నదాతల అగచాట్లు.. ఆత్మహత్యలు.. ఇలా గతాన్ని తలుచుకుంటేనే భయం పుడుతుంది. ఆ కష్టాలను నెమరేసుకుంటే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. కానీ, స్వరాష్ట్రం సాధించిన తర్వాత ఉమ్మడి జిల్లా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. కేవలం ఎనిమిదేండ్ల కాలంలోనే ఎంతో మార్పు కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి దూరదృష్టితో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. పరిపాలన సౌలభ్యం పెరగడానికి పూర్వ జిల్లా నాలుగు జిల్లాలుగా మారింది. ఫలితంగా పాలన మారుమూల గ్రామాలకు చేరువైంది. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు పెరిగాయి. సాగు, తాగునీటి కష్టాలు పూర్తిగా దూరమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. సాగునీటి రంగం సమూలంగా మారిపోయింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో నాలుగు జీవధారలు ఏర్పడ్డాయి.
250 కిలోమీటర్ల పొడవునా గోదావరి జీవం పోసుకున్నది. 180 కిలోమీటర్ల పొడవు ఉన్న మానేరు, 124 కిలోమీటర్ల పొడవున్న వరదకాలువ నిత్య ప్రవాహం అన్న రీతిలో ఉన్నాయి. నిజానికి ఇన్ని సాధ్యమా..? అంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్లిన ముఖ్యమంత్రి.. వాటన్నింటినీ కళ్ల ముందు సాక్షాత్కరింపజేశారు. మిషన్ కాకతీయ కింద సుమారు 800ల చెరువులను పునరుద్ధరింపజేశారు. మధ్యమానేరును నిత్య జల కల్పతరువుగా మార్చారు. ఎగువమానేరు ఎండల్లోనూ మత్తడి దూకింది. నీటికోసం కోటి కష్టాలు పడ్డ సిరిసిల్ల నేతన్నల చెంతకు మానేరు తరలివచ్చింది.
ఫలితంగా వ్యవసాయం మూడింతలు పెరిగింది. ఏ గ్రామానికి వెళ్లి చూసినా ధాన్యపు రాసులే కనిపిస్తున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు మించి ధాన్యం పండిస్తున్నది కరీంనగర్ ఉమ్మడి జిల్లా. ఇదంతా కేవలం ఏడేళ్లలో జరిగిన అభివృద్ధి మాత్రమే. ఇదే కాదు.. నాడు కరెంటు ఉంటే వార్త. నేడు కరెంటు పోతే వార్త. ఆనాడు సమైక్య రాష్ట్రంలోనూ అత్యధిక వ్యవసాయ మోటార్లు ఉన్నది కరీంనగర్‌లోనే. ఇచ్చే రెండు మూడు గంటలు కూడా లోవోల్టేజీ వల్ల వేలాది మోటర్లు కాలిపోయేవి. కానీ, ఇప్పుడు కనురెప్ప పాటు కూడా కరెంటు పోవడం లేదు. రైతుల జీవితాలు మొత్తం మారిపోయాయి.
నిధులు.. ప్రగతి పరుగులు..
ఉమ్మడి జిల్లా ఆదాయ వృద్ధిరేటు పెరిగింది. వ్యవసాయ భూముల ధరలు భారీగా పెరిగాయి. రైతుబంధు, రైతుబీమా పథకాల ద్వారా అన్నదాతల జీవితాలే మారిపోయాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్స్ ఆడపిల్లలకు అండగా నిలుస్తున్నాయి. 200ల పింఛన్ 2 వేలకుపైగా పెరగడంతో పండుటాకు భరోసా దొరికింది. శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ప్రారంభింంచిన దళితబంధు ఎంతో మంది దళిత బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. వివిధ వర్గాలకు ఓవర్సీస్ స్కాలర్షిప్పులు ఇస్తున్నారు. మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు సరఫరా చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. దేశంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేని ఎన్నో విప్లవాత్మక పథకాలు మన వద్ద అమలవుతున్నాయి. ఈ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది.
తెలంగాణ ట్యాగ్‌లైనే నీళ్లు, నిధులు, నియామకాలు అని ఉద్యమ సమయంలోనే చెప్పిన ముఖ్యమంత్రి.. వాటిని ఆచరణ రూపంలో పెడుతున్నారు. ముందుగా సకల సమస్యలకు మూలమైన నీటి ఇబ్బందిని తొలగించే అంశంపై దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రపంచమే అబ్బురపడేలా కేవలం మూడేళ్ల వ్యవధిలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడమే కాకుండా, అనేక ప్రాజెక్టులను నిర్మించారు. తెలంగాణ వ్యాప్తంగా జలసవ్వడులు వినిపిస్తున్న నేపథ్యంలో ‘బంగారు తెలంగాణ’ నిర్మాణమే లక్ష్యంగా ముందుకెళ్లారు. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రగతి పథంలో నడిపించారు. విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో పల్లె, పట్టణాలకు నిధుల వరద పారించారు. ఎవరూ ఊహించనివిధంగా గ్రామాల రూపురేఖలు మార్చి, దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారు. మొత్తంగా 70 ఏండ్ల పాలనలో కనిపించని అభివృద్ధిని కేవలం ఎనిమిదేళ్లలోనే మన ముందుంచారు.
నియామకాలు..
స్వరాష్ట్రంలో నీళ్లు, నిధులు సాకారం కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నియామకాలపై దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున కొలువుల భర్తీకి శ్రీకారం చుట్టారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో దాదాపు 80 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించి విడుతల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి జిల్లాలో సుమారు 10 నుంచి 12 వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. అంతేకాదు, కొత్త జోనల్ విధానం తేవడం వల్ల ఇక్కడి పోస్టులు ఈ ప్రాంత ఉద్యోగార్థులకు దక్కే అవకాశాలు ఏర్పడ్డాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. సమైక్య రాష్ట్రంలో దగాపడ్డ తెలంగాణ ఇప్పుడు సగర్వంగా తలెత్తుకొనే స్థాయికి చేరింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏ కోణంలో చూసినా ప్రథమ శ్రేణిలో ఉంది.