కొత్తపల్లి, మే 29 : అభివృద్ధి, సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న టీఆర్ఎస్కే ప్రజలను ఓటడిగే హక్కు ఉన్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశానికి చేసిందేంలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్వై నేత రెడ్డవేణి మధు ఆధ్వర్యంలో ఆదివారం కొత్తపల్లి మండలం బావుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 600 మందికి పైగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు టీఆర్ఎస్లో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు కరీంనగర్ జిల్లా అంటే ప్రత్యేక అభిమానం ఉన్నదని, ఆయన ఆదేశాల మేరకు వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే రెండో సారి గెలిచిన చరిత్రలేదని, కానీ తను మూడు సార్లు గెలిచి చరిత్రను తిరగరాశానని చెప్పారు. సమైక్య పాలనలో తెలంగాణ రైతాంగం వివక్షకు గురైందన్నారు. కరెంట్ ఉంటే నీళ్లు ఉండేవి కావని, నీళ్లు ఉంటే కరెంట్ ఉండేది కాదని చెప్పారు. వ్యవసాయం భారమై అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే కరీంనగర్‌ను అభివృద్ధ్దికి కేరాఫ్‌గా మార్చామని చెప్పారు. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ విస్తరణతో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది టీఆర్ఎస్ మాత్రమేననని స్పష్టంచేశారు. ఇది గుర్తించే యువకులు టీఆర్ఎస్లో చేరేందుకు ముందుకువ స్తున్నారని చెప్పారు. పార్టీలోకి వచ్చిన వారికి అండగా ఉంటామన్నారు.
నమ్మకాన్ని వమ్ము చేసిన మోదీ..
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో మోదీ ప్రధానిగా ఉంటే దేశం బాగుపడుతుందని అందరూ భావించారని, కానీ ఆయన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు తెగనమ్మి నమ్మకాన్ని వమ్ముచేశారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం కల్లోలంగా ఉండేదని, వరుస ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలతో అల్లాడిపో యేదన్నారు. దేశం వెలిగిపోతుందన్న గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ శ్రేణులు వారి పాలిత రాష్ర్టాల్లో కనీసం 9 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉండడంతోనే వేగంగా అభివృద్ధి సాధ్యమైందన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ మూడేండ్ల కాలంలో జిల్లాకు చేసింది శూన్యమని, కనీసం తన హయాంలో ప్రారంభించిన పథకాలను కొనసాగించలేకపోతున్నాడని విమర్శించారు.
బీజేపీ నేతలు మతం పేరిట యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్నారని మండిపడ్డారు. దేశంలో అన్నివర్గాలకు జీవించే హక్కు ఉన్నదన్నారు. మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ ఎవరూ అడగకున్నా రూ 50 కోట్లతో టీటీడీ గుడి నిర్మాణానికి శ్రీకా రం చుట్టారన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తుండటంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్లకు దూరమవుతున్నారన్నారు. కాగా కమాన్‌పూర్ నుంచి భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బావుపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించగా, మంత్రి గంగుల కమలాకర్ బైక్‌పై కూర్చోని యువకులను ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి శ్రీలతా మహేశ్‌గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కాసారపు శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సాబీర్, భూక్యా తిరుపతినాయక్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు శ్రీపతిరావు, సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.