ధర్మపురి నియోజకవర్గానికి ఎస్సారెస్పీ నీరే ఆధారం. ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపల్లి మండలాలు, పెద్దపల్లి జిల్లా పరిధిలోని ధర్మారం మండలం పరిధిలో ఎస్సారెస్పీ ఆయకట్టు 82 వేల ఎకరాలు ఉండగా, డీ83/ఏ, డీ83/బీ మెయిన్ కెనాళ్లతోపాటు మైనర్ కెనాళ్లు 425 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ కాలువల ద్వారా మొదట్లో పంటలకు పుష్కలంగా నీరందగా, కాలక్రమేణా పూడికతో నిండి చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొన్నది. సమస్యను రైతులు ఎన్నిసార్లు విన్నవించినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అయితే స్వరాష్ట్రంలో మంత్రి కొప్పుల ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వానికి విన్నవించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధర్మపురి నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. 2020 మే 18న ‘జలహితం’ పేరుతో మంత్రి ఈశ్వర్ పనులను ప్రారంభించగా, కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. ఉపాధి కూలీలు 23 రోజుల్లోనే ఆరుమండలాల్లోని 138 గ్రామాల్లో 369.32 కిలోమీటర్ల మేర పునరుద్ధరించారు. వర్షాల కారణంగా మిగతా 55.68 కిలోమీటర్లు పనులు ఆగిపోయాయి.
మరో పది రోజుల్లో సంపూర్ణం..
మొదటి విడుత విజయవంతం కాగా, రెండో విడుత ‘జలహితం.. జనహితం’ పేరుతో పనులను ఈ నెల 21న ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలో ఎస్సారెస్పీ కాలువలైన డీ53(మెయిన్కెనాల్, మైనర్కెనాల్), డీ83/ఏ, డీ83/ఏ, 9ఎల్, డీ83/ఏ, 12ఎల్, డీ83/ఏ, 13ఎల్, డీ83/బీ, డీ83/బీ9ఎల్, 12/ఆర్, డీ83/బీ 13ఎల్, డీ83/బీ 7ఆర్, డీ83/బీ 19ఎల్, డీ 83/బీ, డీ64 మెయిన్కెనాల్. మైనర్ కెనాల్, డీ64/11ఎల్, డీ64/10ఆర్, డీ64/7ఆర్ 1ఎల్ కాలువలతో పాటు రోళ్ల వాగు డిస్ట్రిబ్యూటరీ, బోలిచెరువు డిస్ట్రిబ్యూటరీ తదితర కాలువల మరమ్మతులు చేపట్టారు. కాలువల్లో బుంగలు పూడుస్తున్నారు. చెట్లు, పొదలు, రాళ్లు తొలగిస్తున్నారు. వీటితోపాటు మొదటి విడుత పూర్తి చేసిన కాలువల్లో ఈ రెండేళ్లలో పెరిగిన చెట్లు, చెత్తను తొలగిస్తున్నారు. వచ్చే నెల 10వరకు పనులు పూర్తి చేసి, జలహితాన్ని సంపూర్ణం చేస్తామని డీఈఈ నారాయణరెడ్డి తెలిపారు.
రైతు కండ్లలో ఆనందం చూడడమే లక్ష్యం..
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలమైంది. పుష్కలంగా నీటి లభ్యత ఉన్నందున ఆయకట్టు చివరి భూములు తడపాలన్న ఉద్దేశ్యంతో ఎస్సారెస్పీ కాలువలు, చెరువులకు అనుసంధానంగా కెనాళ్లలో పూడిక తీయించాలని సంకల్పించా. ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వడంతో జలహితం పేరిట పనులు చేపట్టినం. మొదటి విడుతలోనే దాదాపు పనులు పూర్తయినయ్. 20 రోజుల్లోనే 20 ఏండ్ల నాటి పూడిక ఎత్తిపోసినం. రెండో విడుతలో కొంత మేర మిగిలి ఉన్న పనులు మొదలు పెట్టినం. అవికూడా పూర్తి కావస్తున్నయ్. చివరి ఆయకట్టు భూముల వరకు నీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా తీసుకుపోయి రైతు కండ్లలో ఆనందం చూడడమే లక్ష్యం.
– కొప్పుల ఈశ్వర్, మంత్రి
చి‘వరి’దాకా పారింది..
.. ఇతని పేరు జెల్లేల కనుకయ్య. వెల్గటూర్ మండలం గుల్లకోటకు చెందిన ఇతనికి గ్రామంలో ఏడెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. డీ/83/ఏ కాలువ చివరి ఆయకట్టు భూమైనా గతంలో ఒక్కసారైనా సాగునీరు వచ్చింది లేదు. కాలువ ఉన్న సంబురమే కానీ పూడిక పేరుకుపోయి, చెత్తా చెదారంతో నిండిపోయి కనిపించేది. దీంతో కనకయ్య తన వ్యవసాయ బావి పైనే నమ్మకం పెట్టుకుని మూడెకరాల్లో వరిసాగు చేసేది. యాసంగిలో నీళ్లు సరిగా అందక సగం ఎండేది.. సగం పండేది.. రెండేళ్ల కిందట మంత్రి కొప్పుల ఈశ్వర్ చేపట్టిన ‘జలహితం’తో కాలువలో పూడిక తొలగిపోయింది. చివరి వరకు పుష్కలంగా నీళ్లు రావడంతో కనకయ్య తన మొత్తం భూమిని సాగులోకి తెచ్చాడు. ఇప్పుడు ఆయన భూమిలో గుంట కూడా ఎండకుండా బంగారం లాంటి పంట పండుతోంది.
– వెల్గటూర్
మంత్రికి ధన్యవాదాలు..
మంత్రి ఈశ్వర్ సార్ చొరవతో చేపట్టిన జలహితం విజయవంతంగా నడుస్తున్నది. రెండో విడుత కాలువల మరమ్మతు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కెనాళ్లలో ఎక్కడా నీరు ఆగకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతున్నది. నీటి లభ్యత పుష్కలం కావడంతో బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. నీటి లభ్యత వల్ల గ్రామాల్లో వ్యవసాయ భూముల ధరలు రెండింతలయ్యాయి. నిరంతరం రైతు గురించి ఆలోచిస్తూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ సారుకు, మంత్రి ఈశ్వర్ సారుకు రైతుల తరపున ధన్యవాదాలు.
– సౌళ్ల భీమయ్య, ఆర్బీఎస్ కన్వీనర్, ధర్మపురి
సాగునీటికి ఇబ్బందులు తీరినయి..
జలహితంతో ఎస్సారెస్పీ కాలువలు బాగవుతున్నయి. కాలువల నిర్మాణం చేపట్టినప్పటి నుంచి పూడిక తీత పనులు చేపట్టకపోవడంతో అధ్వానంగా మారిపోయాయి. మొదటి విడుతనే కాలువలు మంచిగైనయి. రెండో విడుతతో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. చివరి ఆయకట్టు దాకా సాగు నీరు చేరి పంటలకు నీటి కరువు లేకుండా పోతుంది.
– బాల్సాని నిహారిక-శ్రీనివాస్, సర్పంచ్, దోమలకుంట, పెగడపల్లి మండలం