ముస్తాబాద్, మే 26 ;‘సూదుంటే మందులేదు.. మందుంటే సూది లేదు.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’ అనేది ఓ చిత్రంలోని పాపులర్ పాట.. ఉమ్మడి పాలనలో పరిస్థితులకు అద్దంపట్టేలా ఓ కవి రాసిన సినీగీతం అప్పట్లో మార్మోగింది.. కానీ, ఇదంతా గతం.. పరిస్థితి మారింది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు పేదల వైద్యానికి పెద్దపీట వేసింది.. విరివిగా నిధులు కేటాయించి వైద్యశాలల రూపుమార్చింది.. లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్లు సైతం ఉచితంగా చేస్తున్నారు. సర్కారు దవాఖానల్లో ప్రసవాల పెంపే లక్ష్యంగా చేపట్టిన కేసీఆర్ కిట్ సత్ఫలితాలనిచ్చింది.. సాధారణ ప్రసవాల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది.. ఇందులో పోతుగల్ పీహెచ్సీ 71 నార్మల్ డెలివరీలతో జిల్లాలో ప్రథమ స్థానం దక్కించుకున్నది.
వసతుల కల్పనపై దృష్టి
పోతుగల్ పీహెచ్సీ సాధారణ ప్రసవాల్లో జిల్లాలోనే ప్రథమ స్థానం దక్కించుకోవడం అభినందనీయం. సర్కారు దృష్టికి తీసుకెళ్లి విరివిగా నిధులు మంజూరు చేయించి దవాఖానలో వసతులు మెరుగుపరిచినం. వైద్యసిబ్బంది సైతం బాగా పనిచేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తాం.
– తన్నీరు గౌతం రావు, సర్పంచ్, పోతుగల్
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు పేద కుటుంబాలకు బాసటగా నిలిచాయి. కడుపు కోతలు లేకుండా సాధారణ కాన్పులు జరుగతున్నందునే ప్రైవేటు వైద్యశాలలకు పోకుండా మహిళలు సర్కారు దవాఖానలకు వస్తున్నారు. పేద మహిళలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు కడుపుకోతలు లేకుండా దవాఖానలను బలోపేతం చేసిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు మహిళల పక్షాన కృతజ్ఞతలు
– అక్కరాజు లలిత. వైస్ ఎంపీపీ (పోతుగల్ 1వ ఎంపీటీసీ)
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజలకు సర్కారు దవాఖానలపై నమ్మకం పెరిగింది. ముఖ్యంగా కేసీఆర్‌కిట్, ఆరోగ్యలక్ష్మి , 102 వాహన స్కీంలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఆరోగ్యలక్ష్మి కింద అంగన్వాడీ సెంటర్లలో పౌష్టికాహారం అందిస్తున్నారు. కేసీఆర్ కిట్ అమలుతో పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలు సైతం ప్రభుత్వ వైద్యశాలల్లో కాన్పులు చేయించుకొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ స్కీం కింద బాలింతకు కేసీఆర్ కిట్‌తో పాటు ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలు, మగ బిడ్డ పుడితే రూ. 12వేల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు. అలాగే 102 వాహనంలో తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నారు.
పోతుగల్ పీహెచ్సీలో 71 సాధారణ కాన్పులు
పోతుగల్ పీహెచ్సీ పరిధిలో 22 గ్రామాలు ఉన్నాయి. 9 ఉప కేంద్రాలు ఉన్నాయి. నిత్యం 100కిపైగా ఓపీ సంఖ్య ఉంటుంది. పోతుగల్ పీహెచ్‌సీతో పాటు ముస్తాబాద్, చీకోడు, ఆవునూర్, బందనకల్, గూడెం, ఆవునూర్‌లో ఉప కేంద్రాలకు పక్కా భవనాలు ఉండగా, మరికొన్ని గ్రామాల్లో నిర్మించాల్సిఉన్నది. ఈ యేడు సాధారణ ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. ఏకంగా వైద్యసిబ్బంది 71వరకు చేశారు.
ప్రసవాలు పెరగుతున్నాయి.
పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. దాదాపు 90 శాతం వరకు నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి. పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సాధారణ కాన్పుల్లో జిల్లాలోనే ప్రథమ స్థానం దక్కించుకోవడం అభినందనీయం. వైద్య సిబ్బంది కృషితోనే ఈ ఘనత దక్కింది. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లి మున్ముందు మరిన్ని సత్ఫలితాలు సాధిస్తాం.
– సంజీవరెడ్డి వైద్యాధికారి
ఇంటింటా అవగాహన కల్పించాలి..
పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేస్తున్నారు. అంతేకాకుండా కేసీఆర్ కిట్‌ను అందిస్తున్నారు. ఆడబిడ్డ పుడితే రూ. 13 వేలు. మగబిడ్డ అయితే రూ. 12వేల ప్రోత్సాహాకాన్ని అందజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే పోత్గల్ పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెరిగింది. వైద్య సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైంది. మున్ముందు సర్కారు వైద్యశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలి.
– జనగామ శరత్‌రావు. ఎంపీపీ (ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్)