ముకరంపుర, మే 22: కరీంనగర్లోని జింకల పార్కులో చిట్టి పొట్టి జంతువులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఇక్కడ గుంపులుగా సంచరించే వివిధ రకాల జింకలతో పాటు నెమళ్లు, చిలుకలు, వివిధ రకాల పక్షులు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. చిన్న పిల్లలకు వినోదాన్ని పంచేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్కులోకి గినియా పిగ్స్ను కొత్తగా తీసుకువచ్చారు. తోకలేని ఎలుకల్లా అందమైన రంగు, రూపుతో కుందేళ్లను తలపించే ఈ జంతువులు పిల్లలు, పెద్దలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వేసవి సెలవుల నేపథ్యంలో చిన్నారులతో కలిసి జింకల పార్కుకు వచ్చే కుటుంబాలు గినియా పిగ్స్ను చూస్తూ సంబురపడుతున్నారు. కావేడి కుటుంబంలోని కేవియా జాతికి చెందిన ఎలుకలని, దక్షిణ అమెరికాలో ఇండ్లల్లో సరదాగా పెంచుకుంటారని, పెంపకం చాలా సులువనీ అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆహారంగా క్యాబేజీ, క్యారెట్, పచ్చగడ్డిని ఇష్టంగా తింటూ చిచ్చర పిడుగుల్లా ఎప్పుడూ వేగంగా అటూ ఇటూ కదులుతూ పిల్లలను చూపు తిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తున్నాయి.