Karthika Maasam | మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఇరుముడి’ నుంచి మరో క్రేజీ పాట విడుదలైంది. ఇప్పటికే “మల్లెపూల పల్లకి” వీడియో సాంగ్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా మరో పాటను వదిలారు. అయ్యప్ప స్వామి భక్తి దీక్ష విశిష్టతను, ఆధ్యాత్మిక పరివర్తనను అత్యంత హృద్యంగా ఆవిష్కరిస్తూ రూపొందించిన ‘కార్తీకమాసం..’ అంటూ సాగే పూర్తి వీడియో గీతాన్ని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ఆధ్యాత్మిక ప్రియులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో రవితేజ పాత్రలో వచ్చే భావోద్వేగాలు, జీవితంలో అలవాటైన చెడు వ్యసనాలను పూర్తిగా మానుకొని, కఠినమైన అయ్యప్ప దీక్షను భక్తిశ్రద్ధలతో ఎలా కొనసాగించారనే పట్టుదలను ఈ పాటలో దర్శకుడు చాలా చక్కగా చూపించారు. ఒక వ్యక్తి తన అంతరాత్మతో పోరాడుతూ ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేసే ప్రయాణానికి ఈ పాట అద్దం పడుతోంది. సినిమాలోని కథాబలానికి ఈ గీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తాజా వీడియో చూస్తే స్పష్టమవుతోంది.
సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ అందించిన బాణీలు ఈ పాటకు ప్రాణం పోశాయి. హృదయానికి హత్తుకునేలా ఉన్న ట్యూన్స్‌తో పాటు, ఈ పాటకు స్వయంగా దర్శకుడు శివ నిర్వాణ అందించిన సాహిత్యం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తి భావాలతో పాటు జీవిత సత్యాలను ప్రతిబింబించేలా ఉన్న ఈ పదాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. రవితేజ నటన, జీవీ ప్రకాష్ సంగీతం, శివ నిర్వాణ సాహిత్యం-దర్శకత్వం అన్నీ కలిసి ఈ పాన్ని ఒక మ్యూజికల్ మాస్టర్‌పీస్‌గా మలిచాయి.