కలెక్టరేట్, మే 22: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు సూపర్ మారెట్ల ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో ప్రగతి పథంలో పయనిస్తున్న వీరికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుండగా మండల కేంద్రాల్లో విలేజ్ మార్టులు ప్రారంభించి, ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేసి, అన్ని రకాల సరుకులు ఒకేచోట సరసమైన ధరలకు అందించేలా రూపకల్పన చేస్తున్నారు. ఇందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం కూడా తోడ్పాటునందిస్తుండగా, వ్యాపార రంగంలో తమ ప్రతిభను చాటుకునేందుకు ఉద్యుక్తులవుతున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల ద్వారా బ్యాంక్ లింకేజీ రుణాలు అందజేయడంలో గత ఆర్థిక సంవత్సరంలో జిల్లా రాష్ట్రంలో మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది. అలాగే, చెల్లింపుల్లో కూడా మహిళా సంఘాలు ముందుండడంతో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది.
ఇదే స్ఫూర్తితో మహిళల్లో మరింత చైతన్యం నింపుతూ, వారికి ఉపాధి మార్గాలు విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో 11,411 మహిళా సంఘాలున్నాయి. ఇందులో ఇప్పటికే 8,916 సంఘాల్లోని సభ్యులు వివిధ వ్యాపారాలు చేసేందుకు రుణాలు పొందారు. అనేక రకాల వ్యాపారాలతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా స్థాపించి, విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కుటీర పరిశ్రమలు, హోం ఫుడ్స్ లాంటి వ్యాపార సంస్థలు కూడా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి తమతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. వీటి నిర్వహణలో కనబరుస్తున్న నిబద్ధత, వ్యాపార చిత్తశుద్ధిని గమనించిన అధికారులు మార్కెట్లో పోటీ ఉన్న వ్యాపారాలు కూడా వీరితో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలో మండల కేంద్రాల్లో సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక సంఘాలను ప్రోత్సహిస్తున్నారు.
మొదటి విడుతగా జిల్లాలోని 5 మండల కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. శంకరపట్నం, కొత్తపల్లి, చిగురుమామిడి, మానకొండూర్, తిమ్మాపూర్ మండల కేంద్రాల్లో స్థాపించేందుకు నిర్ణయించిన యంత్రాంగం, సూపర్ మార్కెట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారి దరఖాస్తులు పరిశీలించి, ఈనెల 10 నుంచి గ్రౌండింగ్ కూడా చేపట్టారు. పూర్తి కాగానే ఆయాచోట్ల సూపర్మార్కెట్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇవి సక్సెస్ అయితే జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు పేర్కొంటున్నారు. గ్రౌండింగ్ అనంతరం ఆయా మహిళా సంఘాల్లోని సభ్యులకు క్రయ, విక్రయాలపై శిక్షణ ఇచ్చేందుకు కార్యచరణ రూపొందించినట్లు వెల్లడిస్తున్నారు.
త్వరలోనే సూపర్ మార్కెట్ల ఏర్పాటు
జిల్లాలో ఐదు సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాలు క్రమం తప్పకుండా చెల్లించిన సంఘాలను ఎంపిక చేసి, పోటీ లేకుండా గిరాకీ ఉండే మండలాలను గుర్తించి, ఆయా మండల కేంద్రాల్లో స్థాపించేందుకు కసరత్తు చేస్తున్నం. ఈనెల 10 నుంచి సూపర్ మార్కెట్ల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించినం. గ్రౌండింగ్ కూడా పూర్తి కావచ్చింది. త్వరలోనే ఎంపిక చేసిన మండల కేంద్రాల్లో సూపర్ మార్కెట్లు ప్రారంభిస్తాం.
– శ్రీలత, డీఆర్డీవో