హామీలు ఎగవేసి, సంక్షేమ పథకాలను కూలదోసిన కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలు రాష్ట్రమంతా హోరెత్తుతున్నాయి. రోజుకో వర్గానికి కాంగ్రెస్ చేసిన మోసాన్ని బీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తిచాటుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు వంటావార్పు, నిరసన ర్యాలీలు నిర్వహించాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినదించాయి. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీశాయి.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 4 : కాంగ్రెస్ సర్కార్‌పై నారీమణి గర్జించింది. వృద్ధులు, దివ్యాంగులు సైతం భగ్గుమన్నారు. ఆరు గ్యారెంటీలకు మంగళంపాడి, హామీలు ఎగవేయడంపై పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జీవన భృతి రూ.2,500, కల్యాణలక్ష్మి పేరిట రూ.లక్షానూట పదహార్లతోపాటు తులం బం గారం, విద్యార్థినులకు సూటీలు ఇస్తామని మాటిచ్చి నెరవేర్చకపోగా, కేసీఆర్ కిట్ సహా పలు పథకాలను నిర్వీర్యం చేయడంపై మహిళలు నిప్పులు చెరిగారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మూడో రోజైన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. వంటావార్పులతో నిరసనలు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట వంటావార్పు చేపట్టగా, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్లలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత వంటా వార్పు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డితో పార్టీ శ్రేణులు, మహిళలతో కలిసి నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వంటావార్పులో నిర్వహించారు.

హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాకోడలో మాజీ మంత్రి జోగు రామన్న భజనలు చేశారు. మహబూబ్‌నగర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలో తీశారు. జడ్చర్లలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులతో కలిసి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సహపంక్తి భోజనం చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల, వరంగల్ జిల్లా రాయపర్తిలో వంటా వార్పులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన వంటావార్పులో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ర్యాలీ, వంటావార్పునకు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు. వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.

శుక్రవారం ఖమ్మం జిల్లా పెనుబల్లిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో నిర్వహించిన సదస్సులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందులో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, వైరా నియోజకవర్గం కారేపల్లి క్రాస్ రోడ్డులో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి వంటావార్పులో పాల్గొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భారీ ర్యాలీ తీశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లో వృద్ధులు, వికలాంగులు, మహిళలతో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాసర్‌రావు సమావేశం నిర్వహించారు.

వరంగల్ జిల్లా రాయపర్తిలో వంటావార్పులో భాగంగా మహిళలతో కలిసి రోడ్డుపై భోజనం చేస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా, ఎర్రవెల్లి చౌరస్తాలో నిర్వహించిన ప్రదర్శనలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నా రు. మెదక్ జిల్లా మాసాయిపేటలో నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావు వంటావార్పు నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూర్ 2బీహెచ్‌కే సముదాయం వద్ద నిరసనలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ ఆధ్వర్యంలో ఉరితాళ్లతో నిరసన చేపట్టారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో నిర్వహించిన మహిళా సదస్సులో జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు.
వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే నన్నపునేనితో కలిసి వంటావార్పులో పాల్గొన్న శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద వంటావార్పులో భాగంగా రోడ్డుపై బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలతో కలిసి భోజనం చేస్తున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో నిర్వహించిన సదస్సులో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కరీంనగర్-రాయపట్నం రహదారిపై వంటావార్పులో భాగంగా వంట చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, నాయకులు ఉరితాళ్లతో నిరసన
సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ‘హామీల అమలేది?’ అంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్న దివ్యాంగుడు ఎల్లయ్య

మహబూబాబాద్‌లో నిరసన తెలిపి భోజనం చేస్తున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్