సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ద్విచక్ర వాహనాలను బైక్ ట్యాక్సీలుగా వినియోగించుకోవచ్చనే కేంద్ర ప్రతిపాదనలపై తెలంగాణ క్యాబ్ అసోసియేషన్, గిగ్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వాణిజ్య వాహనాల డ్రైవర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయల పన్ను చెల్లించి వాణిజ్య వాహనాలను కొనుగోలు చేయడం ఎందుకో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ క్యాబ్ యూనియన్ అధ్యక్షుడు నగేశ్, తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దిన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ.. ఇష్టానుసారంగా ద్విచక్ర వాహనాలను, వైట్ నెంబర్ ప్లేట్ కార్లను వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవాలనే ఆలోచన సరైంది కాదన్నారు. ప్రయాణికుల భద్రతను పట్టించుకోకుండా కేంద్రం ప్రతిపాదనలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
ప్రైవేట్ ద్విచక్ర వాహనాలను బైక్ టాక్సీలుగా నడపడానికి రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడరీ ప్రతిపాదనను తామంతా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. జీవనోపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యాన్ని స్వాగతిస్తూనే, ప్రైవేట్ వాహనాలను వాణిజ్యపరంగా నడపడానికి అనుమతించే ముం దు ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమం, అగ్రిగేటర్ జవాబుదారీతనం, సమాన అవకాశాలు వంటి అంశాలను తగినంతగా పరిగణనలోకి తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు.
ప్రైవేట్ వాహనాలను వాణిజ్యపరంగా ఉపయోగించగలిగినప్పు డు, డ్రైవర్లు వాణిజ్య వాహనాలను ఎందుకు కొనుగోలు చేయాలి అని ధ్వజమెత్తారు. వేలాది మంది వాణి జ్య వాహన డ్రైవర్లు ఇప్పటికే వాణి జ్య రహదారి పన్ను, ఫిట్నెస్ అవసరాలు, పర్మిట్లు, ఇతర నియంత్రణ సమ్మతి ఖర్చులతో భారం మోస్తున్నారని వివరించారు. ఒకవేళ వైట్ నంబర్ ప్లేట్ వాహనాలు ప్రయాణికుల రాకపోకలు సాగిస్తే ప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికుల భద్రతకు ఎటువంటి గ్యారెంటీ ఇస్తారని ప్రశ్నించారు.
మహిళా ప్రయాణికులకు పటిష్టమైన భద్రతా ఉంటుం దా అని అన్నారు. వాణిజ్య, సొంత వాహన డ్రైవర్లు అంటూ తేడా లేకుం డా ఏకరీతిన వాహనాలు నడుపుకునేలా అనుమతించాలంటూ డిమాం డ్ చేశారు. బైక్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వస్తే వారి జీవితాలు అంధకారంలోకి వెళ్లే ప్రమాద ముందన్నారు. ఓలా, ఉబర్, ర్యాపిడోలను రద్దు చేసి ప్రభుత్వమే యాప్ తీసుకురావాలని డిమాండ్ చేస్తు ంటే ఆ అంశాన్ని పక్కనపెట్టి కేంద్ర ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలనే ఆలోచనను తెలంగాణ ప్రభు త్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతిపాదనలను ప్రభుత్వం అమలు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.