పన్నెండేండ్లుగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని పాలనను ఆయన మద్దతుదారులు ఒక అపూర్వ నవశక పరివర్తనగా చిత్రీకరిస్తూ వస్తున్నారు. వారి దృష్టిలో మోదీ ఒక తిరుగులేని సంస్కరణాభిలాషి. పాతకాలపు పాలనా స్తబ్ధతను బద్దలు కొట్టి, రహదారులు, విమానాశ్రయాల వంటి మౌలిక వసతుల కల్పనను పరుగులు పెట్టించి, ప్రజాసేవలను డిజిటల్ బాట పట్టించి, అంతర్జాతీయ యవనికపై దేశ ప్రతిష్టను సమున్నతంగా నిలిపిన నేతగా వారు భావిస్తారు. గత రాజకీయాల అనిశ్చితిని తుడిచిపెట్టి, బలమైన, కేంద్రీకృత పాలనా శైలిని ఆయన తీసుకొచ్చారని విశ్వసిస్తారు. మోదీ రాజకీయ ప్రభంజనం ప్రధానంగా రెండు ఆకర్షణీయమైన వాగ్దానాలపై నిలబడింది. ఒకటి ‘గుజరాత్ మాడల్’ చాటిన ఆర్థిక సమర్థత కాగా, రెండోది ‘కనిష్ఠ ప్రభుత్వం గరిష్ఠ పాలన’ అనే నినాదం.
విమర్శకుల దృష్టిలో మాత్రం ఇదే దశాబ్దంలో మరో ఆందోళనకర పరిణామం కనిపించింది. కార్యనిర్వాహక అధికారాల మితిమీరిన కేంద్రీకరణ, రాజ్యాంగ వ్యవస్థల స్వయం ప్రతిపత్తిపై దెబ్బ, భిన్నాభిప్రాయాలను వ్యక్తీకరించే ప్రజాస్వామ్య స్వేచ్ఛ సంకోచం, పౌర సమాజంపై ఒత్తిడి, రాజ్యాంగ రక్షణల క్రమక్షీణత వారిని కలవరపెట్టాయి. ఎన్నేండ్లుగానో ఈ రెండు పక్షాలూ తమకు అనుకూలమైన ఉపన్యాసాలు, ఎంపిక చేసుకున్న గణాంకాలతోనే వాదోపవాదాలు సాగిస్తున్నాయి. సమర్థకులు నూతన రహదారులు, విమానాశ్రయాలు, డిజిటల్ చెల్లింపులు, సంక్షేమ పథకాల విస్తృతిని ప్రదర్శిస్తుంటే, ప్రజాస్వామ్య తిరోగమనం, సంస్థాగత విధ్వంసం, రాజకీయ ధ్రువీకరణ, పెరుగుతున్న ఆర్థిక అసమానతలను మోదీ వ్యతిరేకులు ఎత్తిచూపుతున్నారు.
దేశంలో వాదోపవాదాల హోరులో అసలైన మౌలిక ప్రశ్న మరుగున పడిపోతున్నది. 2013తో పోలిస్తే 2024 నాటికి కొత్త రోడ్లు వచ్చాయా? సాంకేతికత విస్తరించిందా? అనేది మాత్రమే పరిపాలనా దక్షతకు అసలైన కొలబద్ద కాదు. కాలక్రమంలో సహజంగా వచ్చే సాంకేతిక పురోగతి, జనాభా పెరుగుదల, పట్టణీకరణ, ప్రైవేట్ రంగ విస్తరణల వల్ల భారత్ వంటి పెద్ద దేశం ఎలాగైనా ఎంతోకొంత ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇక్కడ తేలాల్సిన అసలైన, అత్యంత నిష్ఠూరమైన ప్రశ్న ఒక్కటే. మోదీ పాలన వల్ల భారతదేశం, పూర్వపు సహజ గమనంలో సాధించాల్సిన ప్రగతి కంటే మెరుగైన ఫలితాలను నిజంగా సాధించగలిగిందా?
ఆర్థికవేత్తలు కెవిన్ గ్రియర్, రాబిన్ గ్రియర్ సంయుక్తంగా వెలువరించిన పరిశోధనా పత్రం ‘ప్రామిజెస్: గవర్నెన్స్ అండ్ గ్రోత్ ఇన్ ఇండియా అండర్ మోదీ అండ్ ది బీజేపీ’ ఈ ప్రశ్ననే లోతుగా శోధించింది. రాజకీయ నినాదాలను పక్కనపెట్టి, ఒక కచ్చితమైన శాస్త్రీయ నమూనా ద్వారా మోదీ పాలనా తీరును మదింపు చేసింది.
2014కు ముందున్న రాజకీయ, ఆర్థిక గమనం యథావిధిగా కొనసాగి ఉంటే దేశం నేడు ఏ స్థాయిలో ఉండేదో గణాంకాలతో అంచనా వేసి, దాన్ని మోదీ హయాంలోని వాస్తవ ఫలితాలతో తులనాత్మకంగా పోల్చి చూసింది.
కెవిన్ గ్రియర్, రాబిన్ గ్రియర్ విశ్లేషణ ప్రకారం మోదీ పన్నెండేండ్ల పాలన ఒక వాగ్దాన భంగాల కథ. అటు ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో, ఇటు ఆర్థిక పురోగతి సాధించడంలో దేశం తన సహజ సామర్థ్యం కంటే వెనుకబడింది. పరిశోధకుల పరిభాషలో చెప్పాలంటే ‘భారత్ అత్యంత ప్రమాదకరమైన అధ్వాన స్థితి’కి చేరింది. అంటే ఒకవైపు సంస్థాగత వ్యవస్థలు బలహీనపడటం, మరోవైపు ఆర్థిక ప్రగతి కూడా ఆశించిన స్థాయి కంటే మందగించడం ఏకకాలంలో సంభవించాయి.
అసలైన గీటురాయి
2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు, దేశంలో నడుస్తున్న సాధారణ అభివృద్ధ్ధి చక్రాలను అలాగే నడిపిస్తానని మాత్రమే చెప్పలేదు. సమూల పరివర్తన తీసుకొస్తానని హామీ ఇచ్చారు. తన దృఢమైన నాయకత్వం, సత్వర నిర్ణయాలు, అధికార యంత్రాంగపు జాప్యాన్ని తగ్గించడం, పారిశ్రామిక అనుకూల వాతావరణం దేశ రూపురేఖలనే సమూలంగా మార్చేస్తాయని ప్రచారం చేశారు. గత పాలకులు అరవై ఏండ్లలో చేయలేనిది తాము అరవై నెలల్లో సాధిస్తామని ప్రకటించారు.
పరిపాలనా పరమైన హామీ కూడా అంతే ప్రతిష్ఠ్ఠాత్మకమైనది. ‘కనిష్ఠ ప్రభుత్వం గరిష్ఠ పాలన’ ద్వారా పాలనలో సమర్థత, పారదర్శకత, జవాబుదారీతనం ఇనుమడిస్తాయని ప్రజలు ఆశించారు. బలమైన రాజకీయ నాయకత్వం వస్తే వ్యవస్థలు పటిష్టమవుతాయని, దాంతో పాటే ఆర్థికాభివృద్ధి కూడా శరవేగంగా పరుగులు తీస్తుందన్న ఆశల మధ్యనే మోదీ అధికారాన్ని చేపట్టారు. ఈ వాగ్దానాలనే గీటురాయిగా తీసుకొని కెవిన్ గ్రియర్, రాబిన్ గ్రియర్ పరిశోధన చేశారు. 2014 తర్వాత భారత్ ఎదిగిందా లేదా అనేది వారి ప్రశ్న కాదు, దేశం కచ్చితంగా ఎదిగింది. కానీ, అంతకుముందున్న సహజమైన వేగం కొనసాగి ఉంటే సాధించాల్సిన దానికంటే వేగంగా, సమర్థంగా ఎదిగిందా లేదా అనేదే వారు పరిశీలించారు. దీనికోసం వారు గణాంక శాస్త్రంలో పేరొందిన ‘సింథటిక్ కంట్రోల్ మెథడ్’ను ఉపయోగించారు.
భారత్‌ను ఏదో ఒక దేశంతో మాత్రమే పోల్చకుండా, 2014కు ముందు భారతదేశ ఆర్థిక, పాలనా పరిస్థితులతో దగ్గరి పోలికలున్న పలు దేశాల సూచికలను కలిపి భారత్‌ను ఒక నమూనాగా సృష్టించారు. ఈ ఆర్థిక నమూనాలో ఇథియోపియా, చైనా, బంగ్లాదేశ్‌కు ప్రధాన వాటాలు ఉండగా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ వంటి ఇతర దేశాల గణాంకాలూ ఉన్నాయి.
ఈ దేశాలు రాజకీయంగా భారత్‌తో సమానమని చెప్పడం వీరి ఉద్దేశం కాదు, 2014 కంటే ముందు భారత్ ఏ గమనంలో సాగిందో అదే రీతిని పునఃసృష్టించగల ఒక ప్రామాణిక నమూనాను తయారు చేయడమే వీరి లక్ష్యం. 2014 వరకు ఈ నమూనా భారతదేశ వాస్తవ గమనంతో అచ్చంగా సరిపోయింది. అయితే 2014 తర్వాత మాత్రం వాస్తవ భారతదేశం, ఈ నమూనా అంచనా వేసిన స్థాయి కంటే దిగజారడం మొదలైంది. ఆ వ్యత్యాసమే మోదీ పాలనలోని డొల్లతనాన్ని బహిర్గతం చేసింది.
దేశం చేరిన అధ్వాన తీరం
మోదీ దశాబ్దపు పాలనను విశ్లేషించేందుకు పరిశోధకులు నాలుగు పరిణామాలతో కూడిన ఒక సూత్రాన్ని ప్రతిపాదించారు. మొదటిది, మెరుగైన పాలనతోపాటు అద్భుతమైన ఆర్థిక పురోగతిని ఏకకాలంలో సాధిస్తామన్న మోదీ వాగ్దానం. రెండోది, ప్రజాస్వామ్య స్వేచ్ఛ కాస్త తగ్గినా, కండ్లు చెదిరే స్థాయిలో ఆర్థిక ప్రగతి సాధించడంతో సరిపెట్టుకోవడం. మూడోది, వ్యవస్థాగత నియమాలు బాగుపడినా ఆర్థికవృద్ధి నెమ్మదించే ప్రజాస్వామ్య వైరుధ్యం. ఇక నాలుగోది ప్రజాస్వామ్య వ్యవస్థలూ కూలిపోవడం, అదే సమయంలో ఆశించిన స్థాయిలో ఆర్థికవృద్ధి కూడా రాకపోవడం అనే అధ్వాన స్థితి.
కెవిన్ గ్రియర్, రాబిన్ గ్రియర్ పరిశోధన ప్రకారం భారత్ సరిగ్గా ఈ నాలుగో క్యాటగిరీ అయిన అధ్వానస్థితిలోనే కూరుకుపోయింది. ‘గరిష్ట పాలన’ దక్కలేదు, పాలనను ఉక్కుపాదంతో నడిపించినా ఊహించిన ఆర్థిక ఫలితాలూ రాలేదు. ఇందులోని అత్యంత కీలకమైన సత్యం ఏమిటంటే, ‘ప్రజాస్వామ్య విలువలను కాస్త పక్కనబెడితేనే దేశం ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది’ అనుకున్న బలమైన నాయకత్వ సిద్ధాంతం ఘోరంగా విఫలమైంది. విలువలను బలిపెట్టినా దేశానికి దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనం ఏమాత్రం దక్కలేదు.
వ్యవస్థాగత విధ్వంసం
పాలనా ఫలితాల విశ్లేషణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వి-డెమ్ డాటాబేస్ ఆధారంగా ఎన్నికల ప్రజాస్వామ్యం, ఉదారవాద విలువలు, కార్యనిర్వాహకవర్గంపై న్యాయ-శాసనసభల నియంత్రణలు, రాజకీయ అవినీతి, భావప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, సమాన రక్షణ వంటి పది కీలక సంస్థాగత సూచికలను పరిశోధకులు మదింపు చేశారు. 2014 తర్వాత పదేండ్ల కాలానికి సంబంధించి లెక్కించిన వంద ఫలితాలలో, ఏకంగా తొంభై ఆరు సందర్భాల్లో భారతదేశం తన నమూనా అంచనా కంటే వెనుకబడింది. అందులో తొంభై రెండు ఫలితాలు అత్యున్నత గణాంక విశ్వసనీయతతో కూడిన స్పష్టమైన క్షీణతను నమోదు చేశాయి.
ఈ పతనం ఏదో ఒక రంగానికో లేదా సంస్థకో పరిమితం కాలేదు. 2013 నాటి ప్రాథమిక స్థాయితో పోలిస్తే ఎన్నికల ప్రజాస్వామ్యంలో అరవై శాతానికి పైగా, ఉదారవాద ప్రజాస్వామ్య స్వేచ్ఛలో దాదాపు 70 శాతం, భావప్రకటనా స్వేచ్ఛలో 56 శాతం పతనం నమోదైంది. మతస్వేచ్ఛలో అత్యంత దారుణంగా 168 శాతానికి పైగా క్షీణత కనిపించగా, చట్టం ముందు సమానత్వం, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ, ప్రభుత్వంపై పార్లమెంట్ నియంత్రణ, చట్టపరమైన సమాన రక్షణ, న్యాయవ్యవస్థ స్వతంత్రత వంటి అంశాలన్నీ తీవ్రమైన క్షీణతను చవిచూశాయి.
ఈ ఫలితాలను బట్టి చూస్తే ప్రజాస్వామ్యం దెబ్బతింటున్నదన్న విమర్శలు కేవలం రాజకీయ ఆరోపణలో లేక విదేశీ పక్షపాతమో కావని, వాస్తవ గణాంకాలే అనే నిజాన్ని రుజువు చేస్తున్నాయని స్పష్టమవుతున్నది. ఇందులో అన్నిటికంటే రాజకీయంగా ఇబ్బందికరమైన అంశం ఏంటంటే అవినీతి గురించిన విశ్లేషణ. స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన అందిస్తాననే నినాదంతోనే మోదీ 2014లో పాలనా పగ్గాలు చేపట్టారు. కానీ కెవిన్ గ్రియర్, రాబిన్ గ్రియర్ అధ్యయనం ప్రకారం రాజకీయ అవినీతి సూచిక నమూనా అంచనాల కంటే దాదాపు 47 శాతం దిగజారింది. మోదీ కంటే ముందు అవినీతి లేదా అంటే కచ్చితంగా ఉండేది. కానీ మోదీ వచ్చాక దేశం మునుపటి కంటే స్వచ్ఛంగా మారిందా అనేదే ప్రశ్న. అలా జరుగలేదని లెక్కలు చెప్తున్నాయి. అధికారం మొత్తం ఒకరి చేతుల్లోనే కేంద్రీకృతమైతే అవినీతి దానంతటదే అంతం కాదన్న సత్యాన్ని ఈ విషయం స్పష్టంచేస్తున్నది. అధికారాన్ని కేంద్రీకరించడం వల్ల ఇతర అధికార కేంద్రాలు అణచివేతకు గురికావొచ్చు కానీ అవినీతి సమసిపోదు. అది మరింత గుంభనంగా, పారదర్శకత లేకుండా తన రూపాన్ని మార్చుకుంటుంది.
సగటు పౌరుడి ఆదాయానికి గండి
మోదీ పాలనకు అసలైన కొలబద్ద ఆర్థిక సమర్థత. గుజరాత్ మాడల్ ఊపుతో దేశాన్ని తిరుగులేని స్థాయికి చేరుస్తామని మోదీ అన్నారు. పరిశోధకులు దీనిని వాస్తవ తలసరి ఆదాయం ఆధారంగా పరీక్షించారు. 2014లో పాలన చేపట్టిన కొంత కాలానికే భారత్ తన సహజ నమూనా కంటే వెనుకబడటం ప్రారంభమైంది. కాలక్రమేణా ఈ అంతరం పెరుగుతూ వచ్చింది. అధ్యయన కాలం ముగిసే నాటికి, సగటు భారతీయుడి వాస్తవ తలసరి ఆదాయం ఉండాల్సిన దానికంటే పది శాతం తక్కువగా నమోదైంది. సామాన్య పరిభాషలో చెప్పాలంటే, పాత ఆర్థిక గమనం యథావిధిగా కొనసాగి ఉంటే సగటు భారతీయుడికి రావాల్సిన వార్షిక ఆదాయంలో దాదాపు వెయ్యి డాలర్లు, అంటే సుమారు ఎనభై వేల రూపాయల కంటే ఎక్కువ గండి పడింది. దీనర్థం, దేశం వెనక్కి నడిచిందని కాదు, దేశం ఎదిగింది. కానీ ఎంత ఎదగాల్సి ఉన్నదో అంతగా ఎదగలేకపోయింది. కంటికి కనిపించే పెరుగుదల వేరు, చేజారిన సామర్థ్యం వేరు.
చేజారిన అవకాశాలు కంటికి కనిపించని నష్టాలు : పరిశ్రమ మూతపడితే కనిపిస్తుంది, ఆర్థిక సంక్షోభం వస్తే అర్థమవుతుంది. కానీ సంపాదించలేకపోయిన ఆదాయాన్ని ఎవరూ చూపించలేరు, సృష్టించలేకపోయిన ఉద్యోగాలు అధికారిక లెక్కల్లోకి రావు. రాలేకపోయిన పెట్టుబడులకు ఆనవాళ్లు ఉండవు. కానీ నిజమైన నష్టం అక్కడే దాగి ఉన్నది. వ్యవస్థలో అప్పటికే ఉన్న సహజ వేగం కంటే నాయకత్వం అదనంగా సాధించిన ప్రగతి ఏమిటన్నదే ఇక్కడ అసలైన లెక్క.
కొవిడ్ సాకు నిలువదు
ఆర్థిక వైఫల్యాలన్నింటికీ కొవిడ్‌నే సాకుగా చూపడం సహజం. కానీ ఈ వాదనను కెవిన్ గ్రియర్, రాబిన్ గ్రియర్ తోసిపుచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ కుంటుపడటం కొవిడ్‌కు ఎంతో ముందే మొదలైంది. సంక్షోభాన్ని కొవిడ్ మరింత తీవ్రం చేసి ఉండవచ్చు కానీ, అసలు లోటు అంతకుముందే మొదలయ్యింది. కొవిడ్ విపత్తు ప్రపంచం మొత్తానికి వచ్చింది తప్ప ఒక్క భారత్‌కే పరిమితం కాలేదు. ఆ కాలాన్ని మినహాయించినా కూడా ఆర్థిక మందగమనం స్పష్టంగా కనిపించింది. అలాగే పెద్ద నోట్ల రద్దు అనేది అనుకోకుండా జరిగిన విపత్తు కాదు. చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని రాత్రికి రాత్రే రద్దు చేయడం అనేది ప్రభుత్వం స్వయంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయం. విజయాలకు క్రెడిట్ తీసుకునే పాలకులే తప్పుడు నిర్ణయాల వినాశకర ఫలితాలకూ బాధ్యత వహించాలి. నోట్ల రద్దు తెచ్చిన నష్టం కచ్చితంగా ప్రభుత్వ ఆర్థిక ఖాతాలోనే పడుతుంది. అదనంగా, 2015 తర్వాత జీడీపీ గణన పద్ధతుల్లో వచ్చిన మార్పుల వల్ల వృద్ధి రేటును కాస్త పెంచి చూపించారనే విమర్శలూ ఉన్నాయి. అదే గనుక నిజమైతే, ఈ పరిశోధన చూపించిన 10 శాతం లోటు వాస్తవంలో అంతకంటే ఎక్కువే ఉండొచ్చు.
రాజకీయ మర్మం
వ్యవస్థలు దెబ్బతిని, ఆర్థిక వ్యవస్థ తన సామర్థ్యం కంటే నెమ్మదించినా మోదీ, బీజేపీ ఎన్నికల్లో ఎలా గెలుస్తూ వచ్చారనే ప్రశ్నకు పరిశోధకులు ఎన్నికల గణితం, విపక్షాల అనైక్యతను కారణంగా చూపారు. 2014లో బీజేపీకి జాతీయ స్థాయిలో వచ్చింది కేవలం 31 శాతానికి పైగా ఓట్లే. అయినప్పటికీ మొదటి స్థానంలో నిలిచిన వారే విజేతగా నిలిచే ఎన్నికల విధానం వల్ల, విపక్షాల ఓట్లు చీలిపోవడంతో ఆ తక్కువ ఓట్ల శాతమే పార్లమెంటులో పూర్తి మెజారిటీగా మారింది. 2014లో లోక్‌సభలో గెలిచిన ఎంపీల్లో 61 శాతం మందికి కనీసం 50% ఓట్లు కూడా రాలేదు. 2024 ఎన్నికలు ఈ రాజకీయ మర్మాన్ని మరింత స్పష్టంగా చాటాయి.
దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్ల శాతం పెరిగినప్పటికీ, సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. కారణం ఒక్కటే, ఇండి కూటమి పేరుతో విపక్షాలు సమన్వయంతో పోటీ చేసి, బీజేపీ వ్యతిరేక ఓటును చీలిపోకుండా ఆపగలిగాయి. ఉత్తరప్రదేశ్ ఇందుకు ప్రబల నిదర్శనం. అక్కడ బీజేపీ తన ఓటు బ్యాంకును కాపాడుకున్నప్పటికీ, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడంతో బీజేపీ సీట్లు మాత్రం గణనీయంగా పడిపోయాయి. దీనిద్వారా తేలిన సత్యం ఏంటంటే, ఎక్కువ ఓట్లు వచ్చినంత మాత్రాన సీట్లు రావాలని లేదు. విపక్షాలు చీలినప్పుడు సాధారణ ఆధిక్యతతోనూ తిరుగులేని అధికారం దక్కుతుంది. అవే విపక్షాలు ఏకమైనప్పుడు అదే ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ మైనారిటీకి పడిపోవాల్సి వస్తుంది. అందువల్ల బీజేపీ విజయాలను కేవలం వారి పరిపాలనా విజయాలుగా చూడలేం. బలమైన భావజాల పునాది, భావోద్వేగాలు, రాజకీయ ధ్రువీకరణ, విపక్షాల దీర్ఘకాలిక బలహీనతలే వారిని గెలిపిస్తూ వచ్చాయి. భావోద్వేగాల మత్తులో ఉన్నప్పుడు ప్రభుత్వ నిజమైన పనితీరును, వ్యవస్థల విధ్వంసాన్ని ప్రశ్నించడం ఓటరు మానేస్తాడు.
వాస్తవ సామర్థ్యానికి నిష్పాక్షిక కొలబద్ద
ఈ పరిశోధన 2014కు ముందున్న కాలాన్ని అద్భుత స్వర్ణయుగంగా కీర్తించడం లేదు. కాంగ్రెస్ హయాంలో అవినీతి లేదని గానీ, లోపాలు లేవని గానీ కెవిన్ గ్రియర్, రాబిన్ గ్రియర్ చెప్పడం లేదు. పాత పాలన వైపు తిరిగి వెళ్లడమే అన్ని సమస్యలకూ పరిష్కారమని కూడా వారు వాదించడం లేదు. వారి వాదన ఒక్కటే, దేశాన్ని మరింత అద్భుతంగా నడిపిస్తానని మోదీ మాటిచ్చారు. ఆ మాట నిలబడిందా లేదా అనేదే పరిశోధకులు లెక్కకట్టారు. ఫలితం మాత్రం ఆ మాట నిలబడలేదనే తేలింది. మోదీ ఏదో ఊహాజనిత పనులు చేయాల్సిన అవసరం లేదు. తనకు వారసత్వంగా అందిన దేశం కంటే మెరుగైన ఫలితాలు చూపిస్తే చాలు. ఆ పరీక్షలోనే ఆయన విఫలమయ్యారని ఆర్థికవేత్తల పరిశోధన స్పష్టం చేసింది.
ఆర్భాటం చేజారిన నవభారతం
మోదీ పాలన నేర్పిన అసలైన పాఠం కంటికి కనిపిస్తున్న కొత్త హైవేలు, విమానాశ్రయాలు, అంతర్జాతీయ సదస్సుల ఆర్భాటాల్లో లేదు. ప్రజాస్వామ్య మూలాలను కాపాడుకుంటూనే, మరింత వేగంగా దూసుకుపోతూ, ప్రతి పౌరుడికీ మరింత సంపదను సమకూర్చగలిగి ఉండిన ఆ రూపుదాల్చని భారతదేశంలోనే ఉన్నది. అధికార కేంద్రీకరణ ఆశించిన సామర్థ్యాన్ని ఇవ్వలేకపోయింది. రాజ్యాంగ వ్యవస్థల క్షీణత ఏ ఆర్థిక అద్భుతాన్నీ సృష్టించలేకపోయింది.
బలమైన నాయకుడొస్తే అన్నీ
బాగుపడుతాయన్న భ్రమను.. అటు మెరుగైన పాలనను గానీ, ఇటు నిజమైన సౌభాగ్యాన్ని గానీ తీసుకురాలేకపోయింది. దేశం ఎదిగింది, కానీ ఎదగాల్సిన దానికంటే తక్కువగా ఎదిగింది. ఎలాంటి అదనపు లాభమూ లేకుండానే వ్యవస్థలను బలిపెట్టేసింది.
అందుకే ఈ దశాబ్దపు అసలైన లెక్కలు తేల్చేటప్పుడు కేవలం నిర్మించినవి మాత్రమే కాదు, కోల్పోయిన వాటిని కూడా చూడాలి. చేజారిన ఆదాయం, రాలేకపోయిన అవకాశాలు, నీరుగారిపోయిన రాజ్యాంగ విలువలను పరిగణనలోకి తీసుకోవాలి. మోదీ హయాంలో దేశం మారిందా లేదా అనేది ప్రశ్న కాదు, కాలంతోపాటు ఏ దేశమైనా మారుతుంది. 2014లో వాగ్దానం చేసిన ఆ అద్భుత భారతంగా మారిందా లేదా అనేదే అసలైన ప్రశ్న. కెవిన్ గ్రియర్, రాబిన్ గ్రియర్ పరిశోధన నిరూపిస్తున్న కఠిన సత్యం ఒక్కటే. భారత్ తన రాజ్యాంగ విలువలను మూల్యంగా చెల్లించింది కానీ, అందుకు తగిన ప్రతిఫలాన్ని అందుకోలేకపోయింది. ఈ దశాబ్దంలో జరిగిన అతిపెద్ద నష్టం ఏమిటంటే… భారతదేశం నిజంగా ఏ స్థాయికి చేరుకోవాల్సి ఉండేనో ఆ మహత్తర అవకాశాన్ని చేజేతులా చేజార్చుకోవడమే.
మోదీ పాలనకు అసలైన కొలబద్ద ఆర్థిక సమర్థత. గుజరాత్ మాడల్ ఊపుతో దేశాన్ని తిరుగులేని స్థాయికి చేరుస్తామని మోదీ అన్నారు. పరిశోధకులు దీనిని వాస్తవ తలసరి ఆదాయం ఆధారంగా పరీక్షించారు. 2014లో పాలన చేపట్టిన కొంత కాలానికే భారత్ తన సహజ నమూనా కంటే వెనుకబడటం ప్రారంభమైంది. కాలక్రమేణా ఈ అంతరం పెరుగుతూ వచ్చింది. అధ్యయన కాలం ముగిసే నాటికి, సగటు భారతీయుడి వాస్తవ తలసరి ఆదాయం ఉండాల్సిన దానికంటే పది శాతం తక్కువగా నమోదైంది. సామాన్య పరిభాషలో చెప్పాలంటే, పాత ఆర్థిక గమనం యథావిధిగా కొనసాగి ఉంటే సగటు భారతీయుడికి రావాల్సిన వార్షిక ఆదాయంలో దాదాపు వెయ్యి డాలర్లు, అంటే సుమారు ఎనభై వేల రూపాయల కంటే ఎక్కువ గండి పడింది. దీనర్థం, దేశం వెనక్కి నడిచిందని కాదు, దేశం ఎదిగింది. కానీ ఎంత ఎదగాల్సి ఉన్నదో అంతగా ఎదగలేకపోయింది. కంటికి కనిపించే పెరుగుదల వేరు, చేజారిన సామర్థ్యం వేరు.
పెండ్యాల మంగళాదేవి