హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కేంద్రీకృత విధానం వల్ల అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందుబాటులోకి వస్తాయని, జవాబుదారీతనం ఉంటుందని కాంగ్రెస్ సర్కార్ ఊదరగొడుతున్నది. కానీ ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. అగ్గువకు కాదు, బహిరంగ మార్కెట్లో రిటైల్ ధర కంటే అత్యంత ఎక్కువకు గురుకుల కిరాణా సామగ్రిని కొనుగోలు చేస్తుండడం గమనార్హం. తాజాగా ఫుడ్ ప్రొవిజన్‌కు ఖరారు చేసిన గురుకుల టెండర్ల ధరలను చూస్తే విస్మయం గొలిపే అనేక విషయాలు వెల్లడవుతున్నాయి.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలతోపాటు, సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మాడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా సంస్థల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉన్నది. బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా, పాలు విజయ డెయిరీ ద్వారా సరఫరా అవుతాయి. ఇవిపోగా వంట తయారీకి కిరాణా సామగ్రి కొనుగోలు టెండర్లను ఇప్పటివరకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ(డీపీసీ)లే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎక్కడికక్కడ టెండర్లను నిర్వహించి, సప్లయ్ బాధ్యతలను గుత్తేదారులకు అప్పగించేవి. కానీ కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతం ఆ విధానానికి చరమగీతం పాడింది.
డీపీసీల స్థానంలో సోషల్వెల్ఫేర్ సెక్రటరీ నేతృత్వంలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను గతేడాది ఏర్పాటు చేసింది. గురుకులాలకు సంబంధించి అన్ని వస్తువులు, నిత్యావసర వస్తువుల ధరల ఖరారు, సేకరణ, సరఫరా, టెండర్ ప్రక్రియను కేంద్రీకృత విధానంలో ఇక్కడే నిర్వహిస్తున్నది. ఏజెన్సీలను ఎంపిక చేస్తున్నది. అందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కిరాణా సామగ్రి సప్లయ్ కోసం కేంద్రీకృత విధానంలోనే గుత్తేదారులను ఎంపిక చేసింది. మేలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి జూన్ మొదటివారం వరకు బిడ్లను స్వీకరించింది. మొత్తంగా ఫుడ్ ప్రొవిజన్లో 93 ఐటమ్స్‌ను లిస్ట్ చేసింది. తాజాగా ఆయా వస్తువుల సరఫరా టెండర్‌ను నకాఫ్(నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రాసెసింగ్ రిటైలింగ్ కోఆపరేటివ్ లిమిటెడ్)కు అప్పగించింది. అంతేకాదు అప్పుడే సరుకుల సరఫరాకు ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇండెంట్లను సమర్పించాలని ఆయా విద్యాసంస్థలకు పీఎంయూ ఉత్తర్వులు ఇచ్చింది.
మార్కెట్ రేట్ కన్నా అధిక ధరలకు..
ప్రభుత్వం ఫుడ్ప్రొవిజన్కు సంబంధించి ఏ కేటగిరీ కింద 27 బ్రాండెండ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆయా వస్తువులు ఎమ్మార్పీ కంటే డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మరో 28 వస్తువులను (పప్పులు, ఉప్పులు) హైదరాబాద్ హోల్‌సేల్ మార్కెట్ ధరల ఆధారంగా ఇవ్వాలని నిర్ణయించింది. మరో 33 వస్తువులను వార్షిక రేట్ల ప్రకారం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం నిర్ణయించిన 3 కేటగిరీల ధరలు సైతం బహిరంగ మార్కెట్ కన్నా అధికంగానే ఉండడం గమనార్హం.
బహిరంగ మార్కెట్లో లభిస్తున్న డిస్కౌంట్ కంటే అత్యల్ప డిస్కౌంట్‌కు, ఇతర వస్తువులను సగటును 10 నుంచి 20 శాతం మేరకు ఎక్కువ ధర నిర్ణయించి ఏజెన్సీకి అప్పగించినట్టు తేటతెల్లమవుతున్నది. వాస్తవంగా పప్పులు, ఉప్పులు, చక్కెర తదితర వస్తువులను హోల్‌సేల్ మార్కెట్లో బల్క్‌గా తీసుకుంటే అత్యంత తక్కువధరకే లభిస్తున్నాయి. కానీ గుత్తేదారులు బహిరంగ మార్కెట్‌కన్నా అధికంగా కోట్ చేయడం, ప్రభుత్వం అప్పగించడం గమనార్హం. జీహెచ్ఎంసీలో బ్లీచింగ్ పౌడర్ ధర కిలోకు సుమారు రూ.14- 45, ఫినాయిల్ లీటరుకు సుమారు రూ. 20 నుంచి రూ. 40 స్థాయిలో కొనుగోలు చేస్తుండగా, గురుకులాల్లో కిలోకు రూ.70, లూజ్ ఫినాయిల్కు లీటరుకు రూ.60 చొప్పున ధరలు నిర్ధారించారు. హ్యాండ్ వాష్ , ఖర్జూరాలు తదితర ఉత్పత్తుల విషయంలో బ్రాండ్ స్పెసిఫికేషన్లపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తంగా కిరాణా సామగ్రి కొనుగోళ్లలో కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాండూరు పప్పు కంటే పిరం
తెలంగాణ తాండూరు పప్పునకు అంతర్జాతీయంగానూ ప్రత్యేక గుర్తింపు ఉన్నది. తాండూరు కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్ ) సైతం లభించింది. ధర కూడా హోల్‌సేల్‌గా కొంటే కిలో రూ.135, రిటైల్ ప్రాసెసింగ్ చేసినా కేజీ రూ.140కే లభిస్తున్నది. కానీ ప్రస్తుతం గురుకులాలకు సరఫరా చేసే కందిపప్పు అంతకంటే ఎక్కువ ధరకు నిర్ధారించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కిలో కందిప్పు ధర రూ. 159గా నిర్ధారించడం గమనార్హం. తాండూరు పప్పు కాకుండా బహిరంగ మార్కెట్లో ఇతర బ్రాండ్ల కందిపప్పు కేజీ రూ.125 నుంచి 135కే లభిస్తున్నది. ఇతర పప్పుల ధరలు సైతం మార్కెట్ రేటుకంటే అధికంగా ఉండడం గమనార్హం. క్లీనింగ్ మెటీరియల్, మసాలాలు, ఇతర వస్తువుల ధరలను సైతం అధికంగానే నిర్ణయించారు. కేవలం కిరాణా టెండర్లలోనే ఏడాది పొడవునా లెక్క వేస్తే వాస్తవ ధరకంటే దాదాపు రూ. 200 కోట్లకుపైగా ఎక్కువ వెచ్చిస్తున్నట్టు తెలుస్తున్నది.
బూట్లు ఇచ్చారు.. సాక్సులు మరచారు
ప్రతి సంవత్సరం ప్రభుత్వ విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్, గురుకుల విద్యార్థులకు వాటితోపాటు అదనంగా పీటీ, నైట్ట్రాక్, బూట్లు, సాక్సులు, ట్రంకుబాక్సులు, ఐడీకార్డులు, ప్లేట్లు, గ్లాసు, కప్పు, కటోరాలు పంపిణీ చేస్తుంటుంది. వాస్తవంగా టెండర్ దక్కించుకున్న ఏజెన్సీ 45 రోజుల్లోనే యూనిఫామ్స్ సప్లయ్ చేయాల్సి ఉంటుంది. ఆ గడువు సైతం ముగిసింది. కానీ ఇప్పటివరకు కనీసం 50 శాతం మంది విద్యార్థులకు సైతం యూనిఫామ్స్ అందలేదు. అదీగాక రెండు యూనిఫామ్స్ అందించాల్సి ఉండగా, ఒకటే ఇచ్చారు. అయితే యూనిఫామ్ నాణ్యతగా లేకపోవడంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇక వైట్‌డ్రెస్, నైట్, పీటీ యూనిఫామ్స్ జాడే లేకుండా పోయాయి. చాలా పాఠశాలల్లో విద్యార్థులకు బూట్లు మాత్రమే సరఫరా చేశారు. సాక్సులను ఇవ్వలేదు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేశామని చెప్తున్నా పిల్లలకు మాత్రం ఆ ఫలాలు అందకుండా పోయాయని తేటతెల్లమవుతున్నది.
