ధోకేబాజ్ కాంగ్రెస్ అంటూ.. ప్రజాకంఠక కాంగ్రెస్ పాలనపై గులాబీ దళం కదనభేరి మోగిస్తున్నది. సర్కార్ వైఫల్యాలపై శుక్రవారం మూడోరోజూ నిరసన గళం వినిపించింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభూతకల్పనల ఆరు గ్యారెంటీలు, 420 హామీల వంచనను వంటావార్పుతో ఎండగట్టింది. ఇంటింటికీ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాలతో హోరెత్తించింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుల ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట బస్ స్టాప్ వద్ద భారీ నిరసన తెలిపారు.
ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అడ్డగుట్టలో నిర్వహించిన వంటావార్పు లో పాల్గొన్నారు. ప్రజలకు కాంగ్రెస్ బాకీ పడిన హామీల వివరాలతో కూడిన బాకీ కార్డులను అందజేశారు. ఉప్పల్‌లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నేతృత్వంలో రామంతాపూర్, నాచారం హెచ్ఎంటీ నగర్, మల్లాపూర్, అశోక్‌నగర్, కాప్రా, ఏఎస్ రావు నగర్ రాధికా చౌరస్తాల్లో వంటావార్పు చేపట్టారు. మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యోదయ వెల్ఫేర్ సొసైటీ, చంద్రగిరి కాలనీ, అల్వాల్ లేబర్ అడ్డా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు.
అంబర్‌పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో శ్రీరమణ చౌరస్తాలో రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించారు. కొత్తపేట వద్ద ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నేతృత్వంలో నిరసన తెలిపారు. రాజ్ భవన్ రోడ్డులో ఖైరతాబాద్ ఇన్చార్జి మన్నె గోవర్దన్ రెడ్డి నేతృత్వంలో, షేక్ పేటలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఇన్చార్జి మాగంటి సునీతాగోపీనాథ్ ఆధ్వర్యంలో, ఎర్రగడ్డలో సీనియర్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి, వెంగళరావునగర్‌లో మాజీ కార్పొరేటర్ దేదీప్య నేతృత్వంలో వంటావార్పులు నిర్వహించారు.

సిటీబ్యూరో, సెప్టెంబరు 4 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభూతకల్పనల ఆరు గ్యారెంటీలు, 420 హామీల వంచనను ఎండగడుతూ గులాబీ దళం కదనభేరి మోగిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ వైఫల్యాలపై చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాలు మూడో రోజు కొనసాగాయి. శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, ప్రధాన చౌరస్తాల్లో బీఆర్ఎస్ శ్రేణులు వంటావార్పులతో రోడ్ల మీదికి వచ్చి సమరశంఖం పూరించాయి.
‘ధోకేబాజ్ కాంగ్రెస్.. పీడిత పాలన నశించాలి’ అనే నినాదాలతో హోరెత్తించాయి. ముఖ్యంగా ప్రజాపాలన పేరిట ప్రజాకంటక పాలన సాగిస్తున్న హస్తం పార్టీ తీరుపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఏకమై వంటావార్పు కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. రహదారులపైనే కట్టెల పొయ్యిలు వెలిగించి, వంటలు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. రైతులకు రూ.2 లక్షల ఏకకాల రుణమాఫీ, మహిళలకు రూ.2,500 మహాలక్ష్మి భృతి, రూ.4వేల పింఛన్, నిరుద్యోగ భృతి, ఉద్యోగ, కార్మిక సమస్యలు సహా ప్రతీ రంగాన్ని కాంగ్రెస్ గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ ఉందో తెలిపే ‘బాకీ కార్డు’లను ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేశారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

హోరెత్తిన నిరసనలు
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల మోసాన్ని ప్రజలకు వివరిస్తూ పలు ప్రాంతాల్లో బాకీ కార్డులను పంపిణీ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుల ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట బస్ స్టాప్ వద్ద నిరసన తెలిపారు. మాజీ కార్పొరేటర్లు జగన్, సురేష్ రెడ్డి, నేతలు శంబీపూర్ కృష్ణ, మహ్మద్ రఫి, విజయరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో అడ్డగుట్టలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలకు కాంగ్రెస్ బాకీ పడిన హామీల వివరాలతో కూడిన బాకీ కార్డులను అందజేశారు. ఉప్పల్‌లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నేతృత్వంలో రామంతాపూర్, నాచారం హెచ్ఎంటీ నగర్, మల్లాపూర్, అశోక్‌నగర్, కాప్రా, ఏఎస్ రావునగర్ రాధికా చౌరస్తాల్లో రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు రాంగోపాల్ పేట, బేగంపేట డివిజన్లలో నిరసనలు తెలిపారు. మాజీ కార్పొరేటర్లు మహేశ్వరి శ్రీహరి, కురుమ హేమలత తదితరులు హాజరయ్యారు. మల్కాజ్‌గిరిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యోదయ వెల్ఫేర్ సొసైటీ, చంద్రగిరి కాలనీ, అల్వాల్ లేబర్ అడ్డా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసనల హోరెత్తించారు.

అంబర్‌పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో శ్రీరమణ చౌరస్తాలో రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బి.వెంకట్‌రెడ్డి, విజయ్‌కుమార్ గౌడ్, పద్మ వెంకట్ రెడ్డి, శిరీష యాదవ్ పాల్గొన్నారు. శేరిలింగంపల్లి మాదాపూర్‌లో ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో నిరసనలు తెలపగా, స్థానిక నాయకులు ఎర్రబెల్లి సతీష్‌రావు ఇతరులు పాల్గొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేట వద్ద ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నేతృత్వంలో మాజీ కార్పొరేటర్ చెరుకు పద్మానాయక్, మహిళా నేతలు నిరసన తెలిపారు.
ముషీరాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో కవాడిగూడ కల్పనా జంక్షన్ వద్ద బీఆర్ఎస్ యువనేత ముఠా జయసింహ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి, ఎడ్ల హరిబాబులతో కలిసి ధర్నా చేపట్టారు. రాజ్ భవన్ రోడ్డులో ఖైరతాబాద్ ఇన్ ఛార్జి మన్నె గోవర్దన్ రెడ్డి నేతృత్వంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. జూబ్లీహిల్స్, మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి షేక్ పేటలో బీఆర్ఎస్ ఇన్ ఛార్జి మాగంటి సునీత గోపినాథ్ ఆధ్వర్యంలో, ఎర్రగడ్డలో సీనియర్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి, వెంగళరావునగర్‌లో మాజీ కార్పొరేటర్ దేదీప్య నేతృత్వంలో వంటావార్పులు నిర్వహించారు. ప్రశ్నించే గొంతులను పోలీసు బలగాలతో నొకేయాలని ప్రభుత్వం చూస్తోందని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్‌రావు ధ్వజమెత్తారు.