జమ్మికుంట రూరల్, మే 21: సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మన బడి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జడ్పీటీసీ శ్రీరాంశ్యాం కోరారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ దొడ్డె మమత అధ్యక్షతన ఎంపీడీవో కల్పన నిర్వహించారు. జడ్పీటీసీ శ్రీరాంశ్యాం, తహసీల్దార్ రాజ్, మండల విద్యాధికారి శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం పంచాయతీరాజ్, విద్య, మహిళా, శిశు సంక్షేమం, వైద్యం, పశు సంవర్ధక, పల్లె ప్రగతి, రహదారులు, భవనాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అటవీశాఖల వారీగా అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. గైర్హాజరైన అధికారులపై సభలో సభ్యులు మండిపడ్డారు. నోటీసులు జారీ చేయాలని ఎంపీపీని కోరారు. ఇసుక రవాణాతో వావిలాల గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, రవాణాను నిలిపివేసి, గ్రామంలో మంజూరైన రోడ్డును వెంటనే పూర్తి చేయాలని మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ సభ దృష్టి తీసుకెళ్లారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో పాపయ్యపల్లి గ్రామ పాఠశాలను మొదటి విడుతలో ఎందుకు ఎంపిక చేయలేదని సర్పంచ్ ఆగయ్య అధికారులను ప్రశ్నించారు.
నగురం, నాగారం గ్రామంలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో నీరందక పంటలు ఎండిపోయాయని అధికారులపై వైస్ ఎంపీపీ తిరుపతిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వావిలాల గ్రామంలో ఓ ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడు చెరువు శిఖం భూమిలో నుంచి రోడ్డు వేశాడని, క్షేత్ర స్థాయిలో విచారణ చేసి, రోడ్డు తొలగించాలని ఎంపీటీసీ మల్లేశం అధికారులను కోరారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ.. మండలంలోని తొమ్మిది పాఠశాలల అభివృద్ధి కోసం ‘మన ఊరు- మన బడి’ కింద రూ. 79 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. వీటితో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలు, విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు. సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు కడవేర్గు మమతతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.