గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరానికి మంచి స్పందన లభిస్తున్నది. అనుభవజ్ఞులైన కోచ్‌ల పర్యవేక్షణలో తమ అభిరుచికి తగిన క్రీడాంశంలో తర్ఫీదు పొందడానికి యువత ఆసక్తి చూపుతున్నది. నిత్యం ఉదయం ఉత్సాహంగా శిక్షణకు హాజరవుతూ ఆటలో మెళకువలను నేర్చుకుంటూ క్రీడారంగంలో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నది.
-శంకరపట్నం, మే 16
జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తాడికల్ జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న వాలీబాల్ శిక్షణపై విద్యార్థులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. కోచ్ కొర్మి సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో శిక్షణలో వాలీబాల్ ఆటలో మెళకువలు నేర్చుకుంటున్నారు. ఇటీవల డీఎస్వైవో కీర్తి రాజవీరు క్రీడా సామగ్రిని అందజేయగా, నిత్యం 32 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ప్రతి రోజూ ఉదయం శిక్షణ శిబిరానికి హాజరవుతూ క్రీడలో నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నారు. రానున్న ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు సైతం ఈ సమ్మర్ క్యాంప్ ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.
వాలీబాల్ ఆటలో టెక్నిక్స్ నేర్చుకుంటున్నం
నాకు వాలీబాల్ ఆట అంటే చాలా ఇష్టం. షాట్స్ బాగా ఆడగలననే కాన్ఫిడెన్స్ ఉంది. రోజూ మార్నింగ్ గ్రౌండ్‌కు వస్తున్నం. సమ్మర్ క్యాంప్‌లో కోచ్ సంతోష్ సార్ ఎన్నో కొత్త టెక్నిక్స్ నేర్పిస్తుండు. దీంతో ఆటలో మరింతగా రాణిస్తున్నం. మార్నింగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నం. నాకు ఇప్పుడు నేషనల్ గేమ్స్‌లో కూడా ఆడతాననే కాన్ఫిడెన్స్ వచ్చింది. పోలీస్ జాబ్స్ కొట్టడానికి ఈ సమ్మర్ క్యాంప్ చాలా మంచి అవకాశం.
-కోడూరి ఉదయ్, క్రీడాకారుడు
రూరల్ ప్లేయర్స్‌కు వరం
ఈ క్యాంపు క్రీడాకారులు వాలీబాల్ క్రీడలో మెళకువలు నేర్చుకొనేందుకు చక్కగా దోహదపడుతుంది. సమ్మర్లో టైం వేస్ట్ చేసుకోవద్దనుకునే రూరల్ ప్లేయర్స్‌కు వరం. ఈ క్యాంప్ ద్వారా ఎంతో మంది వాలీబాల్ క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అభినందనీయం. ఇలా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే అవకాశం కలుగడం గర్వకారణంగా భావిస్తున్న. అవకాశాన్ని ప్రతి క్రీడాకారుడూ సద్వినియోగం చేసుకోవాలి.
-కొర్మి సంతోష్‌కుమార్, కోచ్
మా ఊరికి గుర్తింపు తెస్తా
వేరే గేమ్స్‌తో పోలిస్తే వాలీబాల్ గేమ్ డిఫరెంట్‌గా ఉంటది. వాలీబాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో ఎంతో నేర్చుకుంటున్న. ఇప్పుడు బాగా ఆడగలననే నమ్మకం ఏర్పడుతోంది. తప్పకుండా ఏదో ఒక రోజు నేషనల్ లెవల్ జట్టుకు ఆడి మా ఊరికి గుర్తింపు తెస్తా. అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తారని చాటి చెప్తా.
-డీ రమ, క్రీడాకారిణి
షాట్స్ కూడా తీస్తున్న
మే ఫస్ట్ నుంచి క్యాంప్‌లో కోచింగ్ తీసుకుంటున్న.. ఇప్పుడు వాలీబాల్ మునుపటి కన్నా బాగా ఆడుతున్న. షాట్స్ కూడా తీస్తున్న. రోజూ పొద్దున ఆహ్లాదంగా ఉంటోంది. గంటన్నర పాటు ప్రాక్టీస్ చేస్తున్నం. ఆరోగ్యానికి కూడా ఈ ఆట చాలా ఉపయోగపడుతుంది. వాలీబాల్ నేషనల్ లెవల్లో ఆడాలనేది నా కోరిక. సమ్మర్ క్యాంపు వల్ల ఆ కోరిక నెరవేరుతుందనేది నా ఆశ. మా పేరెంట్స్ కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు.
-కొర్మి ప్రసన్న, క్రీడాకారిణి