విద్యానగర్, మే 6: జిల్లాలో సాధారణ ప్రసవాలు జరిగేలా గర్భిణులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన ప్రభుత్వ దవాఖానల వైద్యులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, జిల్లా ప్రభుత్వ దవాఖానలో సిజేరియన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలను పెంచాలని ఆదేశించారు. 15-18 ఏళ్ల వారికి రెండో డోసు వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు. పీహెచ్సీల్లో ప్రతి సోమ, శుక్రవారం గర్భిణులకు పోషకాహారం అందించాలని సూచించారు. సీడీపీవో, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు సిజేరియన్ ప్రసవాలతో కలిగే అనర్థాలు, సాధారణ ప్రసవాలతో ప్రయోజనాల గురించి గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులకు ప్రతి నెల బీపీ, షుగర్, రక్త పరీక్షలు చేయాలని ఆదేశించారు. పీహెచ్సీలకు, సబ్ సెంటర్లకు ఐఈసీ మెటీరియల్, అవగాహనకు సంబంధించిన పోస్టర్లను పంపిణీ చేస్తామని తెలిపారు. అంగన్వాడీ, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువేరియా, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, డీసీహెచ్ఎస్ రత్నమాల, డాక్టర్ రవీందర్ రెడ్ది, డాక్టర్ అలీం, జిల్లా సమన్వయకర్త శివకృష్ణ, గైనకాలజిస్టులు, వైద్యాధికారులు, సీడీపీవోలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.