కరీంనగర్, మే 5 (నమస్తే తెలంగాణ): సీజన్లో కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారా..? డిమాండ్ ఉన్నవాటిని నల్ల బజార్‌కు తరలించి కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారా..? ఏటా డీలర్ల తీరుతో తీవ్రంగా నష్టపోతున్నారా..? ఎలా అని ఆందోళన చెందుతున్నారా..? ఇక నుంచి ఆ టెన్షన్ అవసరం లేదు.. సీడ్స్ విక్రయాల్లో అవకతవకలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకున్నది. ఆన్లైన్లోనే విక్రయించాలని నిర్ణయించి తాజాగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ మేరకు ఇప్పటికే ఈ విధానంపై డీలర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన యంత్రాంగం, ఈ వానకాలం నుంచే అమలు చేయబోతున్నది.
విత్తనాల కోసం ఇక నుంచి రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. డీలర్లు విక్రయించే ప్రతి విత్తనంపై ఇక నుంచి ప్రభుత్వం కన్నేసి ఉంచబోతున్నది. లైసెన్స్ ఉన్న డీలర్లు మాత్రమే విత్తనాలు విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం ఆన్లైన్లో విత్తనాల విక్రయానికి ఈ సీజన్ నుంచే శ్రీకారం చుడుతున్నది. ఇందుకు ప్రత్యేకంగా www.seeds growerp. com/olms వెబ్‌సైట్‌ను రూపొందించింది. ప్రతి డీలరు తన పరిధిలో జరిగే క్రయ విక్రయాలను ఈ వెబ్సైట్లో పొందుపర్చడం తప్పనిసరి చేసింది. సీడ్ కంట్రోల్ ఆర్డర్- 1983 ప్రకారం లైసెన్స్ ఉన్న డీలర్లు మాత్రమే విత్తనాలు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నది.
కరీంనగర్ జిల్లాలోని 465 మంది విత్తన డీలర్లకు, 78 మంది విత్తనోత్పత్తిదారులకు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు శిక్షణ ఇచ్చారు. వ్యవసాయ డివిజన్లు, మండల స్థాయిలో ఈ శిక్షణ ఇచ్చిన అధికారులు ప్రభుత్వం రూపొందించిన వెబ్సైట్లో క్రయ, విక్రయాలను ఏ విధంగా నమోదు చేయాలో పూర్తిగా అవగాహన కల్పించింది. గతంలో క్రయ, విక్రయాలను విత్తన డీలర్లు ప్రతి నెలా మ్యాన్యువల్ విధానంలో నివేదికలు ఇచ్చేవారు. కొందరు డీలర్లు తప్పుడు సమాచారం ఇచ్చినా అధికారులు విశ్వసించే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో కొందరు డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టేవారు. కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచేవారు. కానీ ఇపుడు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో ప్రతి నెలా 1 నుంచి 5 వరకు ఆన్లైన్లో క్రయ విక్రయాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
పారదర్శకమైన విధానం..
విత్తనాల విక్రయం ఆన్లైన్లో చేయడం వల్ల పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఒక విధంగా ఇదీ సీడ్ క్రమబద్ధీకరణగా చెప్పవచ్చని చెబుతున్నారు. గతంలో డీలర్ల వద్ద ప్రతి నెలా ఎంత స్టాక్ అమ్మకం జరిగేది. ఇంకా ఎంత స్టాక్ నిల్వకు ఉన్నదనే విషయం డీలర్లు చెబితే తప్పా తెలిసేది కాదు. పైగా అక్రమార్జనకు అలవాటు పడ్డ కొందరు డీలర్లు ఇచ్చిందే నివేదిక అన్నట్లు వ్యవసాయ అధికారులు నమ్మాల్సి వచ్చేది. ఏ విత్తనాన్ని ఎంత ధరకు అమ్ముతున్నారో కూడా తెలిసేది కాదు. ఇపుడు ఆన్లైన్లో విత్తనాలు విక్రయించే విధానం వస్తున్న నేపథ్యంలో డీలర్లు తప్పులు చేయడానికి అవకాశం లేకుండా పోతున్నది. నకిలీ విత్తనాలకు సైతం ఈ విధానంతో అరికట్టే అవకాశాలు ఉన్నాయి.
కేవలం ప్రభుత్వం ఆమోదించిన విత్తనాల వివరాలను మాత్రమే ఈ వెబ్సైట్లో పొందుపర్చేందుకు అవకాశం ఉంటుంది. అనుమతి లేని విత్తనాలను వెబ్సైట్ తిరస్కరిస్తుంది. డీలర్ల గోదాముల్లోగానీ, దుకాణంలోగానీ ఆన్లైన్లో పొందుపర్చిన విత్తనాలు మాత్రమే కనిపించాలి. వేరే విత్తనాలు అమ్మకానికి పెట్టినట్లయితే అధికారులు తనిఖీల్లో తేలితే చట్ట రీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఆన్లైన్ విధానంతో కొందరు మినహా చాలా మంది డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు ముందు మ్యాన్యువల్‌గా నివేదికలు ఇచ్చేందుకు తమ పనులు వదిలి అధికారుల వద్దకు వెళ్లాల్సి వచ్చేదని, ఇపుడు తమ దుకాణాల్లోనే కూర్చుని క్రయ, విక్రయాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవడం వల్ల సమయం అనుకూలిస్తుందని చెబుతున్నారు. ఈ విధానం వ్యవసాయ అధికారులకు కూడా చక్కగా అనుకూలించే అవకాశం ఉంటుంది. జిల్లాలో డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాల నిల్వలు ఉన్నాయా..? లేదా..? అనేది ఇక ముందులా డీలర్లను అడిగి తెలుసుకునే అవసరం లేకుండా ఆన్లైన్లో పరిశీలిస్తే తెలిసి పోతుందని అధికారులు చెబుతున్నారు. మండల వ్యవసాయ అధికారి నుంచి హైదరాబాద్‌లోని కమిషనరేట్ అధికారుల వరకు విత్తన విక్రయాలను ఎప్పటికపుడు పర్యవేక్షించే అవకాశం కూడా ఉంటుంది.
పూర్తి పారదర్శకంగా ఉంటుంది..
ఈ వెబ్సైట్లో ప్రభుత్వం ఆమోదించిన విత్తనాలను మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుంది. డీలర్లు విక్రయించిన విత్తనాలను ప్రతి నెలా ఈ సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై మా అధికారులు డివిజన్ల వారీగా, మండలాల వారీగా రైతు వేదికల్లో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఈ విధానం ద్వారా ప్రతి డీలరు జరిపే క్రయ, విక్రయాలు తెలిసిపోతాయి. పూర్తి పారదర్శకంగా ఉంటుంది. నకిలీ విత్తనాలు అమ్మేందుకు అవకాశం ఉండదు. రైతులు కూడా లైసెన్స్ డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేసుకోవాలి. లైసెన్స్ లేని డీలర్ల వద్ద కొనుగోలు చేస్తే నష్టపోతారు. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తెచ్చింది.
– వాసిరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి