తెలంగాణచౌక్, మే 5: జిల్లా కేంద్రంలో పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజాసేవలో తరిస్తున్నాయి. వేసవిలో ఎండ త్రీవత నుంచి ఉపశమనం పొందడానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన చలివేంద్రాలు ప్రయాణికులు, ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో వివిధ స్వచ్ఛంధ సంస్థల ఆధ్వర్యంలో చలువ పందిళ్లలో రంజన్లలో చల్లని నీటిని ఉంచారు. చలివేంద్రాల్లో పులువురు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగునీటిని అందుబాటులో ఉంచుతూ ప్రయాణికులకు అందిస్తున్నారు. శ్రీసత్యసాయి, సఫా బైతుల్ మాల్ తదితర స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను నిర్వహిస్తున్నాయి. ప్రయాణికులు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలను కొనియాడుతున్నారు.
స్వచ్ఛందంగా సేవ చేస్తున్న
శ్రీసత్యసాయి బాబా సేవా సంస్థలో సభ్యుడిని. ప్రతి రోజూ ఒకరి చొప్పున చలివేంద్రంలో మంచినీటిని అందిస్తున్నాం. ఉదయం 8 నుంచి సాయంత్రం వరకు 6 గంటల వరకు ఉంటాం. మధ్యాహ్నం తర్వాత రద్దీ ఎక్కువగా ఉంటుంది. మాతో పాటు సభ్యులుగా ఉన్న డాక్టర్లు, లాయర్లు, వ్యాపారులు సేవలో భాగస్వాములవుతున్నారు. ప్రజలకు సేవ చేయడంలో సంతృప్తి ఉంది.
-పీ లింగమూర్తి (శ్రీసత్యసాయి సేవాసంస్థల కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు)
స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయం
వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు స్వచ్ఛంద సంస్థలు చల్లని తాగునీరు అందిస్తున్నాయి. కరీంనగర్ బస్‌స్టాండ్ నుంచి ప్రతిరోజూ లక్షల మంది రాకపోకలను కొనసాగిస్తారు. స్వచ్ఛంద సంస్థలు వేసవి ముగిసేవరకు చలివేంద్రాలను కొనసాగిస్తామని తెలుపడంతో స్థలాన్ని చూపించాం. బస్టాండ్‌లో ప్రయాణికులకు చల్లని నీటిని అందిస్తున్న సంస్థల సేవలు అభినందనీయం.
–డిపో-1 మేనేజర్, భూపతిరెడ్డి
మానవ సేవయే మాధవ సేవ
మానవ సేవయే మాధవ సేవ అనే సత్యసాయిబాబా సూక్తిని అనుసరించి సేవలను కొనసాగిస్తున్నం. 30 సంవత్సరాలుగా బస్టాండ్‌లో చలివేంద్రాలను నిర్వహిస్తున్నం. ప్రతి రోజూ 1500 లీటర్ల నీటిని అందిస్తున్నం. జమ్మికుంట, హుజూరాబాద్‌లో చలివేంద్రాలను ఏర్పాటు చేశాం.మంచినీటితో పాటు జావ, మజ్జిగ ప్యాకెట్లను అందజేస్తున్నం. స్వచ్ఛందంగా బాబా భక్తులు సేవలందిస్తున్నారు.
–శ్రీనివాస్ (మెడికల్‌షాపు యాజమాని)