కమాన్‌చౌరస్తా, మే 4: జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 51 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 30,927 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం వారు 14,804 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరంలో 16,123 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లో బెంచీకి ఇద్దరిని కూర్చోబెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 6 నుంచి ప్రథమ సంవత్సరం, 7వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ప్రత్యేక భద్రత మధ్య ప్రశ్న పత్రాలు
ఇంటర్ ప్రశ్న పత్రాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. ప్రశ్న పత్రాలను జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందే ప్రశ్న పత్రాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకువెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష సమయం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండగా, విద్యార్థులు గంట ముందే కేంద్రం వద్ద ఉండాలని సూచించారు. అలాగే, పరీక్ష జరిగే ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.
పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు
జిల్లా వ్యాప్తంగా కేటాయించిన కేంద్రాలకు గుర్తింపు పొందిన అధ్యాపకులను అధికారులు ఇన్విజిలేటర్లుగా నియమించారు. అయితే, జిల్లా వ్యాప్తంగా ఉన్న 51 పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడూ పర్యవేక్షించేలా నాలుగు సిట్టింగ్ స్వాడ్, మూడు ఫ్లయింగ్ స్వాడ్ బృందాలను సిద్ధం చేశారు. అలాగే, పరీక్షా కేంద్రానికి ఒకరు చొప్పున 51 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 51 మంది డిపార్టుమెంటల్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు.
ఆన్లైన్లో హాల్‌టికెట్లు..
విద్యార్థుల హాల్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఏ అధికారి సంతకం లేకుండా విద్యార్థులు హాల్ టికెట్లను తీసుకునే అవకాశం కల్పించారు. అలాగే, పరీక్షా కేంద్రంలో భయాందోళనకు లోనయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబర్ 1800 5999 333కు ఫోన్ చేస్తే సైకాలజిస్ట్ వచ్చి మనోధైర్యం కల్పిస్తారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నం
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నం. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నం. కేంద్రాలకు ప్రశ్న పత్రాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నది. క్షేత్రస్థాయి అధికారులు పరీక్షా కేంద్రాలను పరిశీలిస్తున్నరు. విద్యార్థుల హాల్‌టికెట్లు కూడా ఇంటర్ మీడియట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పరీక్షలు నిర్వహిస్తాం.
– రాజ్యలక్ష్మి, డీఐఈవో