మల్లాపూర్, ఏప్రిల్ 22:ఎల్లలు దాటినా కన్న ఊరు మీద ప్రేమ తరగలేదు. విదేశాల్లో స్థిరపడినా చదువుకున్న పాఠశాలను, పెరిగిన పల్లెను మరువ లేదు. మారుమూల పల్లెలో పుట్టి పెరిగి అత్యున్నత స్థాయికి ఎదిగి అమెరికాలో గుండె వైద్య నిపుణుడిగా రాణిస్తున్నా వీలు దొరికినప్పుడల్లా సొంతూరికి సేవ చేస్తున్నాడు ఎన్ఆర్ఐ గండ్ర విద్యాధర్‌రావు. ఇప్పటికే గ్రామాభివృద్ధికి రూ. కోటి మేరకు పనులు చేయగా రూ.60 లక్షలతో సర్కారు బడిని బాగు చేసి ఔదార్యం చాటుకున్నారు.
పుట్టిన ఊరు .. చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకుంటున్నారు ఎన్ఆర్ఐ గండ్ర విద్యాధర్‌రావు. ఒకటి కాదు..రెండు కాదు గ్రామంలో కొన్నేండ్ల నుంచి రూ. కోటి మేర సొంత నిధులు ఖర్చు చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన గండ్ర విద్యాధర్‌రావు వృత్తిరీత్యా అమెరికాలోని న్యూజెర్సీలో ప్రముఖ గుండె వైద్య నిపుణులుగా సేవలందిస్తూ అక్కడే స్థిరపడ్డారు. పుట్టిన స్వగ్రామం, బాల్యంలో చదివిన పాఠశాలకు ఏటా తన వంతు సహాయం చేస్తూ గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారు. 25 ఏళ్లుగా గ్రామాభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు.
1999లో తన సొంత ఇంటితో పాటు, 20 గుంటల సొంత స్థలాన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు విరాళం అందించి తన ఇంటినే ప్రభుత్వ పాఠశాలగా మార్చారు. విద్యార్థులు ఆడుకునేందుకు 2002లో సుమారు 20 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వ పాఠశాలకు అప్పగించారు. 2019లో రూ. 10 లక్షలతో జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు అదనపు తరగతి గదులను నిర్మించారు. సుమారు రెండు లక్షల విలువ గల కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. కొన్నేండ్ల నుంచి పది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు పారితోషికాలను అందజేస్తున్నారు.
ప్రభ్వుత పాఠశాల ఆవరణలో సరస్వతీ మాత విగ్రహం ఏర్పాటుతో పాటు, పాఠశాల అభివృద్ధికి సహాయం అందిస్తున్నారు. పాఠశాలతో పాటు గ్రామంలో సీసీ రోడ్లు, ఓ ట్రాక్టర్, కల్యాణ మండపం నిర్మాణానికి స్థలం, ప్యూరిఫైడ్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఆయన ఎప్పుడు గ్రామానికి వచ్చినా గ్రామస్తులు ఊరేగింపు నిర్వహిస్తూ ఓ పండుగలా సన్మాన కార్యక్రమాలను చేస్తారు.
స్వగ్రామానికి సేవ చేస్తేనే సంతృప్తిగా ఉంటుంది
పుట్టిన ఊరుకు ఎంత సేవ చేసినా తక్కువే. గ్రామస్తుల సహకారంతో ఇప్పటికే నాకు తోచినంత సహాయం చేసిన. విద్య అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తా. గ్రామాభివృద్ధికి సహకారం అందిస్తున్నాను. రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేస్తా.
– ఎన్ఆర్ఐ గండ్ర విద్యాధర్‌రావు
మా గ్రామస్తుల అదృష్టం
ఎన్ఆర్ఐ గండ్ర విద్యాధర్ రావు మా గ్రామంలో పుట్టి పెరగడం మా సాతారం గ్రామస్తుల అదృష్టం. ఏ క్షణంలో గ్రామ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినా వెంటనే సహాయం చేస్తారు. ఇప్పటికే గ్రామానికి రూ. కోటికి పైగా సొంత డబ్బు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేశారు. ఆయనకు మా గ్రామస్తులమంతా ఎప్పటికీ రుణపడి ఉంటం.
– బొడ్డు సుమలత, సర్పంచ్, సాతారం