విద్యానగర్, ఏప్రిల్ 19: ఆరోగ్యవంతమైన తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అంబేదర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించి, మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. విద్యతో పాటు వైద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.
అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో హెల్త్ ప్రొఫైల్ అనే గొప్ప పథకాన్ని చేపట్టామని, ప్రభుత్వ దవాఖానల్లో టీ-హబ్ ద్వారా 44 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు వివరించారు. ఇంట్లో ఉన్న వారందరికీ ఉచిత పరీక్షలు నిర్వహించి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది నిర్ణయిస్తామని జిల్లా వాసులు ఉచిత పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాధి ముదరక ముందే ప్రతి 3-6 నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలని వివరించారు. కరోనాను అరికట్టడంలో జిల్లా ముందు వరుసలో నిలిచిందని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచామని ప్రతి ఒకరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం స్టేడియంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను మంత్రి పరిశీలించారు.
మేయర్ వై సునీల్ రావు మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి విరివిగా నిధులు కేటాయిస్తున్నదని చెప్పారు. ఇక్కడ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చల్ల స్వరూపారాణి హరి శంకర్, డీఎంహెచ్ఓ జూవేరియా, జిల్లా ప్రభు త్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సా జీదా, కార్పొరేటర్లు తోట రాములు ఉన్నారు.