తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 5: దళితుల అభ్యున్నతికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉద్ఘాటించారు. ఎల్ఎండీలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన తిమ్మాపూర్ మండలం రామహనుమాన్నగర్ గ్రామానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు దళిత బంధు ప్రొసీడింగ్ పత్రాలు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. నియోజకవర్గానికి పైలట్ ప్రాజెక్ట్‌గా 100 యూనిట్లు మంజూరు కాగా, రామహనుమాన్ నగర్ గ్రామానికి 13 యూనిట్లను మంజూరు చేశామన్నారు. ఇప్పటికే ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 లక్షల చొప్పున జమ చేశామన్నారు. ప్రాసెసింగ్ పూర్తి చేసి ఈనెల 14న లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లను అందజేస్తామన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ అనిత, ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, సర్పంచ్ యాదగిరి వెంకటేశ్వర్రావు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.