ధర్మారం, ఏప్రిల్ 5: 9 నెలల బాలుడి వైద్యానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. గుండె ఆపరేషన్ చేయించేందుకు రూ.2 లక్షల ఎల్వోసీ అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన పల్లె నిహారిక-లక్ష్మణ్ దంపతులకు ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల కూతురు, 9 నెలల బాబు ఉన్నారు. వారిది పేద కుటుంబం. బాబు పుట్టినప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. బాలుడి అవస్థను చూడలేక హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో పరీక్ష చేయించారు. గుండెకు రెండు రంధ్రాలు ఉన్నాయని, ఆపరేషన్‌కు రూ.లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఏం చేయాలో తోచక ఆ దంపతులు తల్లడిల్లిపోయారు. ఈ క్రమంలో వీరి దీన స్థితిని టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రాసూరి రాజ్‌కుమార్, వార్డు సభ్యుడు కట్ట అనిల్ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి వెంటనే ప్రభుత్వం నుంచి రూ.2లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో మంత్రి ఈశ్వర్ బాబు తల్లిదండ్రులు నిహారిక, లక్ష్మణ్‌కు దానిని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజ్‌కుమార్, వార్డు సభ్యుడు అనిల్ ఉన్నారు.