ధర్మపురి రూరల్, ఏప్రిల్ 3: సరదా కోసం చెరువులోకి ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు విగతజీవులుగా మారారు.. లోతు తెలియక నీట మునిగి మృత్యువాత పడ్డారు.. ఆదివారం జరిగిన ఈ ఘటనతో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాలలో విషాదం నిండింది.. బతుకుదెరువు కోసం వేరే ప్రాంతం నుంచి వచ్చిన కుటుంబం ఓ బాలుడిది కాగా, మరో ఇద్దరి తండ్రులు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారు. ఇంటి నుంచి నవ్వుతూ వెళ్లిన కొడుకులు కానరానిలోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఈత సరదా ముగ్గురి విద్యార్థులను బలిగొన్నది. చెరువులోకి దిగిన ప్రా ణస్నేహితులు నీట మునిగి మరణించడం విషాదాన్ని నింపింది. చేతికొచ్చిన కొడుకులు ఇక లేరని తెలిసి తల్లిదండ్రులు రోదించిన తీరు ప్రతిఒక్కరిని కలిచివేసింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాలలో ఆదివారం జరిగింది. ధర్మపురి సీఐ కోటేశ్వర్, ఎస్ఐ కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మెనాల గ్రామానికి చెందిన గొలుసుల యశ్వంత్(13), మారంపల్లి శరత్(14), పబ్బతి నవదీప్(10) ము గ్గురు మిత్రులు. వీరు ఆదివారం ఉదయం ఈత కోసం గ్రామ శివారులోని చెరువులోకి వెళ్లారు. ఈత కొడుతూ లోతు ఎక్కువ ఉన్నచోటికి వెళ్లి గల్లంతయ్యారు. 11 గంటల సమయంలో కట్టపై నుంచి వెళ్తున్నే పలువురు గ్రామస్తులు చెరువులో తేలిన బాలుడి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారమందించారు. సీఐ కోటేశ్వర్, ఎస్ఐ కిరణ్‌కుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తేలిన మృతదేహం యశ్వంత్దని గుర్తించారు. వెంటనే ధర్మపురికి చెందిన గజ ఈతగాళ్లను పిలిపించి చెరువులో గాలించగా శరత్, నవదీప్ మృతదేహాలు లభించాయి. ముగ్గురు మృ త దేహాలపై పడి తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. పోలీసులు మృత దేహాలకు పంచనామా చేసి పోస్టుమార్టం కోసం జగిత్యాల దవాఖానకు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొ ని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు.
మృతులందరూ పేదింటి బిడ్డలే..
మృతి చెందిన వారందరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారే..యశ్వంత్ తల్లిదండ్రులు తిరుపతి-లక్ష్మి దంపతులది నల్గొండ జిల్లా దోసారం. ఏడాది క్రితం బతుకుదెరువును వెదుక్కుంటూ తుమ్మెనాలకు వలస వచ్చారు. క్రేన్‌తో బావులు తవ్వుకుంటూ బతుకుతున్నారు. కొడుకు యశ్వంత్‌ను గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 4వతరగతిలో చేర్పించారు. శరత్ తల్లిదండ్రులు రజిత-సత్తెన్న. తండ్రి జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తల్లి కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నది. కొడుకును గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో ఆరోతరగతి చదివిస్తున్నారు. పబ్బతి నవదీప్ తల్లిదండ్రులు పుష్పలత-కిషన్. తండ్రి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తల్లి దొరికిన పనిచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. కొడుకు సవదీప్ను ధర్మపురిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నాలుగో తరగతి చదివిస్తున్నారు.